ట్రంప్ వెన‌క‌డుగు..ప్ర‌పంచానికి ఓ రిలీఫ్‌

Update: 2018-06-21 04:50 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న మొండి ప‌ట్టు వీడారు. త‌న త‌ల‌తిక్క నిర్ణ‌యం నుంచి వెన‌క్కు త‌గ్గారు.  అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి వస్తున్న కుటుంబాలను అరెస్టు చేసి తల్లిదండ్రులను - పిల్లలను వేరుచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అధ్యక్షుడు ట్రంప్ తన మనస్సు మార్చుకున్నారు. అక్రమ వలసదారుల కుటుంబాలను విడదీసి తల్లిదండ్రులను - పిల్లలను వేరుచేయకుండా అధికారిక ఉత్తర్వులను జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇకపై కుటుంబాలను కలిపే ఉంచుతామని చెప్పారు. గత రెండు నెలల కాలంలో అక్రమంగా సరిహద్దులు దాటివచ్చిన కుటుంబాలకు చెందిన 2,500 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి విడదీసి శిబిరాలకు తరలించారు.

మెక్సికో వైపు నుంచి అక్రమంగా సరిహద్దులు దాటుతున్న కుటుంబాలను అరెస్టు చేస్తున్న అధికారులు వారిలో తల్లిదండ్రులను జైలుకు - పిల్లలను మాత్రం సరిహద్దులో నెలకొల్పిన శిబిరాలకు తరలిస్తున్నారు.ట్రంప్ ఆదేశాల వ‌ల్ల ఆ శిబిరాలలో పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం హృదయవిదారకంగా ఏడుస్తున్న దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. దీంతో ట్రంప్ వలస విధానాలను రాజకీయ నాయకులు సహా ఐక్యరాజ్యసమితి అధికారులు - హక్కుల కార్యకర్తలు - కార్పొరేట్ సంస్థల అధిపతులు కూడా ట్రంప్ విధానాన్ని తప్పుపట్టారు.మెక్సికో సరిహద్దులో సాగుతున్న కుటుంబాల ఎడబాటును ఆపాలని ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తన తండ్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించినట్టు సీఎన్ ఎన్ - వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థలు తెలిపాయి. ఇవాంకా నుంచి ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడనప్పటికీ రిపబ్లికన్ సభ్యులతో సమావేశం సందర్భంగా తన కుమార్తె వ్యాఖ్యలను ట్రంప్ వివరించినట్టు ఆ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కుటుంబాల ఎడబాటు సందర్భంగా పిల్లల హృదయ విదారకమైన ఏడ్పులకు సంబంధించిన దృశ్యాలను తాను చూశానని - ఈ సంక్షోభాన్ని వెంటనే ముగించాలని ఇవాంకా తనను కోరినట్టు ట్రంప్ తెలిపారు. తాను కూడా ఆ దృశ్యాలను చూశానని - అవి ఎంతో బాధాకరంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఒక చట్టపరమైన పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని చెప్పారు.

మ‌రోవైపు ప్ విధానాలను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తప్పుబట్టారు. ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం క్రూరంగా, అసంబద్ధంగా ఉందని, దాని మార్పును కోరుతున్నామని తెలిపారు. అమెరికా వలసదారుల దేశం. మన ఆర్థిక వృద్ధి కోసం - మన సమాజాల - కంపెనీల అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆహ్వానిస్తాం. అలాగే అవసరమైన వారికి మన దేశం ఆశాదీపంగా ఉన్నది అంటూ వలస విధానాలపై మైక్రోసాఫ్ట్ సంస్థ వైఖరిని వెల్లడించారు. అమెరికా దక్షిణ సరిహద్దులో శరణార్థులుగా వచ్చిన కుటుంబాల నుంచి పిల్లలను వేరు చేయడం ఓ తండ్రిగా - వలసదారునిగా నన్ను వేదనకు గురి చేస్తున్నది అని నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్ భార్య మెలానియా - తాజాగా ఆయనకు సలహాదారుగా ఉన్న కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరడం - మ‌రోవైపు మీడియా నుంచి సైతం పెద్ద ప్ర‌తిఘ‌ట‌న వ‌చ్చిన నేప‌థ్యంలో ట్రంప్ వెన‌క్కు త‌గ్గారు.
Tags:    

Similar News