భారతీయులకు షాకిచ్చిన ట్రంప్..ఆశలు అడియాశలే..!

Update: 2019-01-31 11:35 GMT
హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థనను పరిశీలించే ప్రక్రియను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రారంభించింది. అయితే.. అమెరికా ఉన్నత విద్యాసంస్థల మాస్టర్స్ డిగ్రీ లేక అడ్వాన్స్‌ డ్ డిగ్రీ ఉన్న వారికి హెచ్-1బీ లాటరీలో ప్రాధాన్యం కల్పించనున్నట్లు యూఎస్ డీహెచ్ ఎస్ స్పష్టం చేసింది. దీంతో చైనా - భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వారి కంటే యూఎస్ డిగ్రీలున్న వారికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ఉన్నత విద్యా సంస్థల్లో అడ్వాన్స్‌ డ్ డిగ్రీలు లేని భారతీయ ఔత్సాహికులకు హెచ్-1బీ వీసా లభించడం మరింత కఠినతరం కానుంది. ఆన్‌ లైన్‌ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని కూడా డీఎచ్ ఎస్ వాయిదా వేసింది. ప్రతీ సంవత్సరం అమెరికా దేశం 65,000 హెచ్-1బీ వీసాలను పొందేందుకు పలు రంగాల్లో ప్రావీణ్యులైన విదేశీయులకు అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఎక్కువ శాతం భారతీయులే ఉండేవారు. వీటితో పాటు అమెరికాలోని విద్యాసంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించిన వారికి మరో 20000 మందికి మాస్టర్స్ క్యాప్ విధానంలో హెచ్-1బీ వీసాలు పొందే అవకాశం కల్పించేది.

అయితే.. ఈసారి జరిగే ‘రెగ్యులర్’ క్యాప్ లాటరీ ప్రక్రియలో అమెరికా మాస్టర్స్ డిగ్రీ కలిగిన వారికి ప్రాధాన్యమివ్వనున్నారు. ఆన్‌ లైన్‌ లోనూ దరఖాస్తు నమోదు చేసుకునేందుకు ఈ కొత్త ప్రక్రియలో అవకాశం కల్పించనున్నారు. కానీ ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే హెచ్-1బీ 2020 సెషన్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది. ఈ విధానం వల్ల భారత్‌లో ఐటీ రంగానికి సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడాలనుకునే చాలామంది కలలకు గండి పడనుంది. ట్రంప్ తొలి నుంచీ చెబుతున్నట్టుగానే అమెరికన్లకే ఎక్కువ శాతం ఉద్యోగావకాశాలు కల్పించేలా ఈ ప్రక్రియ ఉందనేది ఐటీ నిపుణుల అభిప్రాయం. న్యూయార్క్‌ కు చెందిన ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకుడైన సైరస్ డి మెహతా మాట్లాడుతూ.. ఈ విధానం ఎంతోమంది నిపుణులైన ఉద్యోగులను అమెరికాకు దూరం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన ఉదాహరణతో వివరించారు. విదేశీ విద్యాసంస్థలో ఉన్నత విద్యనభ్యసించిన ఓ విదేశీ ఫిజీషియన్ అమెరికాలోని వైద్య సదుపాయాలు లేని ఓ ప్రాంతంలో తన సేవలను అందించే అవకాశాలను ఈ నూతన విధానం దూరం చేస్తుందని చెప్పుకొచ్చారు.

హెచ్-1బీ వీసాలను ఎక్కువగా భారత్‌ కు చెందిన ఐటీ రంగంపై మక్కువ ఉన్న ఔత్సాహికులు పొందేవారని.. భారత్‌ లో ప్రముఖ విద్యా సంస్థ నుంచి తగిన విద్యార్హతను పొంది నైపుణ్యం కలిగిన ఓ ఐటీ ఉద్యోగి అమెరికాకు వచ్చి తన సేవలను అందించేందుకు ఈ నూతన విధానం అవరోధంగా మారుతుందని మెహతా తెలిపారు. అమెరికా విద్యా సంస్థల నుంచి ఉన్నత విద్యకు సంబంధించిన డిగ్రీలు పొందిన వారికి ఉన్న వృత్తి సామర్థ్యం తాను ప్రస్తావించిన ఫిజీషియన్‌ కు - భారత్‌ కు చెందిన ఐటీ ఉద్యోగికి కూడా ఉన్నప్పుడు వారి సేవలను వినియోగించుకోవడానికి ఉన్న అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ విధానాన్ని సమర్థిస్తున్న వారూ లేకపోలేదు. అమెరికాకు చెందిన ఓ ఐటీ సంస్థ అధినేత మాట్లాడుతూ.. ఈ విధానం వల్ల అమెరికన్లలో వృత్తి నైపుణ్యం కలిగిన విద్యావంతులకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని.. తద్వారా అమెరికన్లకు తగినన్ని ఉద్యోగాలు దొరుకుతాయని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చాలామంది భారతీయ ఐటీ ఔత్సాహికులకు షాకింగ్ న్యూస్ అని చెప్పక తప్పదు.

హెచ్-1బీ వీసా అంటే ఏమిటి?

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. పలు రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. ఈ హెచ్-1బీ వీసా పొందే విదేశీయుల్లో ఎక్కువగా భారతీయులే ఉంటారు.

Tags:    

Similar News