పవన్ కల్యాణ్ సోమవారం కరెక్టా లేకపోతే మంగళవారం కరెక్టా ?

Update: 2022-08-23 08:30 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు, వ్యాఖ్యలతో మామూలు జనాల సంగతి ఎలాగున్నా జనసైనికులకు మాత్రం  పిచ్చెక్కిపోవటం ఖాయం.  పొత్తుల విషయంలో పవన్ రోజుకో మాట మాట్లాడుతుండటంతో దేన్ని నమ్మాలో పార్టీ నేతలకు, శ్రేణులకు అర్ధం కావటం లేదు.

తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ, టీడీపీలకు దూరమన్నారు. టీడీపీ పల్లకి మోయటానికి తాను ఎంతమాత్రం సిద్ధంగా లేనని ప్రకటించారు. అందరు పవన్ చెప్పింది నిజమేనేమో అనుకున్నారు.

మంగళవారం మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరితో అయినా చేతులు కలుపుతానని ప్రకటించారు. పొత్తుల విషయంలో సోమవారం చెప్పింది కరెక్టా లేకపోతే మంగళవారం చెప్పింది కరెక్టా ? అన్నది పార్టీ నేతలకే అర్ధం కావటం లేదు.

ఒక్కోరోజు ఒక్కో మాట మాట్లాడటం పవన్ కు మొదటినుండి బాగా అలవాటు. మొన్న మాట్లాడుతు నరేంద్ర మోడీ చెప్పారు కాబట్టే 2014లో టీడీపీకి మద్దతిచ్చినట్లు చెప్పారు. అంతకుముందు ఒకసారి మాట్లాడుతూ కమ్మోళ్ళకు కాపులు వ్యతిరేకం కాదని నిరూపించేందుకే టీడీపీకి మద్దతిచ్చినట్లు చెప్పారు.

మొత్తానికి పవన్ మాటలను గమనిస్తే అర్ధమయ్యేదేమంటే పూర్తి గందరగోళంలో ఉన్నారు. తన గందరగోళాన్ని, అయోమయాన్ని పార్టీ నేతల్లోకి ఎక్కిస్తున్నారు. దీనివల్ల జనసేనే దెబ్బతింటుంది కానీ ప్రత్యర్ధి పార్టీలకు ఏమీ కాదు. తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవటం పూర్తిగా పవన్ ఇష్టమే అనటంలో సందేహం లేదు. పొత్తు పెట్టుకోదలచుకుంటే అదే మాట చెప్పచ్చు. లేదా పొత్తు వద్దనుకున్నా అదేమాటను చెప్పేయచ్చు. అలా కాకుండా ఒకసారి ఎవరితో అయినా పొత్తుంటుందని, మరోసారి టీడీపీ పల్లకి మోసేది లేదని అనటమే ఆయనలోని అయోమయానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఇక అధికారం దక్కని ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, బలిజ, ఒంటరి కులాలకు రాజకీయాధికారం దక్కటం కోసమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరినీ కలుపుకుని వెళతానన్నారు. పవన్ చెప్పిందే నిజమైతే ఏ సామాజికవర్గానికి నూరుశాతం అధికారం ఎప్పటికీ దక్కదు. ఎందుకంటే బీసీలనే తీసుకుంటే 130 ఉపకులాలున్నాయి. అసెంబ్లీ సీట్లు 175, ఎంపీ సీట్లు 25 మాత్రమే ఉన్నాయి. అన్ని సీట్లను బీసీలకే ఇచ్చేయగలరా ? ఎవరికీ పవన్ చెప్పినట్లు చేయటం సాధ్యం కాదు. లాజిక్ ఆలోచించకుండా అందరినీ అయోమయంలోకి నెట్టేయటమే పవన్ స్టైల్.
Tags:    

Similar News