దసరా రోజు రక్షణ మంత్రి ఆయుధపూజ ఎక్కడ చేశారంటే

Update: 2019-10-08 09:21 GMT
వివాదాస్పద రఫేల్ ఒప్పందం గుర్తుంది కదా.. మోదీ ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు ముప్పతిప్పలు పెట్టిన ఈ ఒప్పందం ద్వారా కొనుగోలు చేస్తున్న తొలి జెట్ దసరా రోజున భారత్‌కు సరఫరా కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఫ్రాన్స్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడ రఫేల్ జెట్‌కు ఆయుధ పూజ చేసిన తరువాత తొలి యుద్ధ విమానాన్ని డెలివరీ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన రాజ్ నాథ్, ఫ్రాన్స్ కు రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇండియాకు ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామని, ఇరు దేశాల మధ్యా సంబంధాలు మరింతగా బలపడ్డాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్యా స్నేహబంధం కొనసాగుతుందని చెప్పారు.

రాజ్ నాథ్ ఫ్రాన్స్ చేరుకోగానే అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. గడువులోగా మిగతా అన్ని యుద్ధ విమానాలనూ డెలివరీ ఇవ్వాలని ఈ సందర్భంగా రాజ్ నాథ్ కోరారు. ఒకవైపు దసరా, మరోవైపు ఐఏఎఫ్ 87వ వార్షికోత్సవం కూడా కావడంతో రాజ్ నాథ్ ఈ రోజు రఫేల్ జెట్ డెలివరీ తీసుకోవడం ఆసక్తికరంగా మారంది. పొరుగు దేశం పాకిస్తాన్‌తో పరిస్థితులు గతి తప్పుతున్న క్రమంలో రఫేల్ జెట్‌లు భారత అమ్ముల పొదిలో చేరుతుండడం కీలకంగా మారనుంది.

కాగా రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికలకు ముందు విపక్షాలు ఆరోపణలు చేశాయి. అనిల్ అంబానీ కంపెనీకి లబ్ధి కలిగించేలా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించాయి. అయితే.. దీనిపై సుప్రీంకోర్టు తొలుత అవకతకవలు ఏమీ లేవని తీర్పు చెప్పింది. అనంతరం ఆ క్లీన్ చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి కోర్టు మళ్ళీ రఫేల్ కేసును విచారణకు స్వీకరించింది.

రఫేల్ ఒప్పందంపై వివాదం కారణంగా ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సంకట స్థితిలో పడ్డారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో మోదీ గతం కంటే ఘనమైన విజయం సాధించడం.. విపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో కొన్నాళ్లుగా రఫేల్ అంశం మరుగునపడిపోయింది. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం తొలి విమానం డెలివరీ కానుండడంతో దేశవ్యాప్తంగా దీనిపై పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది ఇప్పుడు.
Tags:    

Similar News