సార్వ‌త్రికం సౌండ్ కు ఎండ్ కార్డ్ ప‌డింద‌బ్బా!

Update: 2019-05-17 17:19 GMT
దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చార హోరుకు కాసేప‌టి క్రితం శుభం కార్డు ప‌డిపోయింది. ఏడు ద‌శ‌ల సుదీర్ఘ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టిస్తే... ఇప్ప‌టికే ఆరు ద‌శ‌ల పోలింగ్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. చివ‌రిదైన ఏడో విడ‌త పోలింగ్ ఎల్లుండి (ఈ నెల 19)న జ‌ర‌గ‌నుంది. ఈ పోలింగ్ కు సంబంధించి హోరాహోరీ ప్ర‌చారం సాగింది. ఓ వైపు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ - మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ - ఇంకోవైపు త‌మ‌దే కీల‌క భూమిక అంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకున్న ప్రాంతీయ పార్టీల కూట‌మి... ఇలా జ‌నంపై ముప్పేట ప్ర‌చార దాడి జ‌రిగింద‌నే చెప్పాలి.

పోలింగ్ ద‌శ‌లు ముగుస్తున్న కొద్దీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలితే... పెద్ద ఎత్తున వివాదాలు కూడా రేకెత్తాయి. అయితే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా సాగిన నేత‌లు... వివాదాల‌ను ప‌ట్టించుకోకుండా త‌మ‌దైన శైలిలో ప్ర‌చారాన్ని సాగించారు. ఓ వైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిఘా నేత్రాలు త‌మ‌ను వెంటాడుతున్నాయ‌న్న అంశం తెలిసి కూడా నేత‌లు ఎంత‌మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ గానే ప్ర‌చారం సాగ‌లేదు. మోదీ వ‌ర్సెస్ రాహుల్ తో పాటు మోదీ వ‌ర్సెస్ దీదీ - మోదీ వ‌ర్సెస్ బెహ‌న్ జీ - మోదీ వ‌ర్సెల్ లాలూ స‌న్స్‌ - మోదీ వ‌ర్సెస్ చంద్ర‌బాబు ఇలా విభిన్న కోణాల్లో ప్ర‌చారం సాగింది. ఎన్ని వైపున నుంచి అస్త్రాల్లాంటి మాట‌లు దూసుకువ‌చ్చినా... మోదీ కూడా ఒంట‌రి అన్న ఫీలింగ్ లేకుండానే స‌మ‌ర్ధ‌వంతంగానే ఎదురు దాడి చేశారని చెప్పాలి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌ధాని హోదాను కూడా దిగ‌జార్చార‌న్న వాద‌న కూడా వినిపించింది. అయినా కూడా మోదీ త‌గ్గ‌లేదనే చెప్పాలి. ప్ర‌చార గ‌డువు ముగిసే దాకా ఎంత మేర ఓట్లు రాబ‌ట్టామ‌న్న విష‌యమే ప్ర‌ధానంగా క‌దిలిన మోదీ... విప‌క్షాలు ఎన్ని ఉన్నా కూడా పెద్ద‌గా వెన‌క్కు త‌గ్గిన దాఖ‌లా కూడా క‌నిపించ‌లేదు. తాను పోటీ చేస్తున్న వార‌ణాసి ఎన్నిక కూడా చివ‌రి ద‌శ‌లోనే ఉన్నా... వార‌ణాసిలో ప్ర‌చారానికి వెళ్లని మోదీ... మిగిలిన ప్రాంతాల‌ను మాత్రం చుట్టేశార‌నే చెప్పాలి. చివ‌రి ద‌శ లో భాగంగా ఏడు రాష్ట్రాలు - ఓ కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజక‌వ‌ర్గాల్లో ఈ నెల 19న పోలింగ్ జ‌గ‌ర‌గ‌నుంది. ఈ ఏడో ద‌శ కు సంబంధించిన ప్ర‌చార గ‌డువు కూడా కాసేపటి క్రితం ముగియ‌డంతో నేటి సాయంత్రం దాకా సంద‌డి చేసిన మైకులు మూల‌కు చేరిపోయాయి.
Tags:    

Similar News