ఈసీ.. షాకింగ్ డెసిష‌న్‌.. ఇక ఏపీ, తెలంగాణ‌ల్లో వీరు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరు!

Update: 2022-10-15 14:30 GMT
కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కొంత‌మంది అభ్య‌ర్థుల‌కు తీవ్ర షాక్ ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి సకాలంలో ఖర్చుల వివరాలు చెప్పని అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌వారు 157 మంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించి 107 మంది ఉండ‌గా..  ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 50 మంది ఉన్నారు.

వీరు అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోటీ చేసి ఎన్నిక‌ల్లో అయిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను త‌మ‌కు అంద‌జేయ‌లేద‌ని అందుకే వీరిపై చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 10-ఎ ప్రకారం.. ఇలా ఎన్నిక‌ల ఖ‌ర్చుల లెక్క‌లు చెప్ప‌నివారిని  మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా ప్రకటించింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌తోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 1,073 మంది అభ్యర్థులపై ఇలా ఎన్నిక‌ల్లో మూడేళ్ల‌పాటు పోటీ చేసే అవ‌కాశం లేకుండా అనర్హత వేటు వేసింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 174 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉంది తెలంగాణ‌నే కావ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ‌లో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు పోటీ చేసి ఎన్నిక‌ల ఖ‌ర్చుల వివ‌రాలు చెప్ప‌నివారు 107 మంది ఉన్నారు.

తెలంగాణ‌లో అసెంబ్లీకి పోటీ చేసిన‌వారిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లెక్క‌లు అందించ‌నివారు 35 మంది, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 42 మంది ఉన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు చెప్పని వారిలో తెలంగాణ నుంచి 72 మంది అభ్య‌ర్థులు ఉన్నారు.

అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసిన‌వారిలో 8 మంది ఎన్నిక‌ల ఖ‌ర్చుల వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి అంద‌జేయలేదు. వీరంతా ఇక నుంచి మూడేళ్ల‌పాటు ఏ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా కేంద్ర ఎన్నిక‌ల సంఘం అన‌ర్హ‌త వేటు వేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News