ఇవాళ కాకుంటే సోమ‌వార‌మే షెడ్యూల్!

Update: 2019-03-09 06:14 GMT
అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ ఎప్పుడు వెలువ‌డుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల మొద‌లు దేశ ప్ర‌జ‌ల వ‌ర‌కూ ఉత్కంట రేగేలా ప‌రిస్థితి. రాజ‌కీయ వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం ఇప్ప‌టికే సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావాల్సి ఉంద‌ని.. అయితే.. సాంకేతిక కార‌ణాల‌తో కాలేద‌న్న వాద‌న ఉంది.

అయితే.. ఇంకా స‌మ‌యం ఉన్నందునే తాము విడుద‌ల విష‌యంలో ఆల‌స్యం చేస్తున్న‌ట్లుగా ఈసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్ర‌ధాని మోడీ నుంచి పాజిటివ్ సిగ్న‌ల్ రాలేద‌ని.. ఆయ‌న ప‌చ్చ‌జెండా ఊపిన వెంట‌నే షెడ్యూల్ రిలీజ్ చేస్తార‌ని చెబుతున్నారు. అయితే.. ఈ వాద‌న‌ను ఈసీ వ‌ర్గాలు ఖండిస్తున్నాయి.

త‌మ‌ది స్వ‌తంత్య్ర వ్య‌వ‌స్థ అని.. తాము ఎవ‌రి ప‌రిధిలోకి రామ‌ని.. త‌మ‌కు తామే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఈసీ వర్గాలు చెబుతున్నా.. తెర వెనుక ఏదో జ‌రుగుతుంద‌న్న ఆరోప‌ణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ అయితే ఈ రోజు (శ‌నివారం) లేదంటే సోమ‌వారం వెలువ‌డ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం శ‌నివారం కంటే సోమ‌వారానికే షెడ్యూల్ విడుద‌ల‌కు అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

దీనికి ఒక కార‌ణాన్ని చూపిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా వ‌ర్సిటీల్లో ప‌దోన్న‌తుల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ఒక‌టి కేంద్రం విడుద‌ల చేయాల్సి ఉంద‌ని.. అది శనివారం ఉద‌యం కానీ సాయంత్రం కాని వెలువ‌డుతుంద‌ని.. దాని కోస‌మే షెడ్యూల్ విడుద‌ల ప్ర‌క‌ట‌న ఆగిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక‌వేళ‌.. ఈ ఆర్డినెన్స్ శ‌నివారం ఉద‌యం వెలువ‌డితే.. అది వెలువ‌డిన కొద్ది గంట‌ల‌కే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంద‌టున్నారు. ఒక‌వేళ‌.. ఆర్డినెన్స్ శ‌నివారం సాయంత్రం వెలువ‌డిన ప‌క్షంలో సోమ‌వారం ప‌క్కాగా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం రెండు తెలుగురాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు. షెడ్యూల్ విడుద‌లైతే కానీ ఈ విష‌యంపై క్లారిటీ రాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News