రియల్ రీల్ సీన్.. రాణిని గుర్తు పట్టక ఆమెతోనే ఫోటో తీయించుకున్నాడు

Update: 2022-09-10 04:21 GMT
అత్యున్నత స్థానాల్లో ఉండి కూడా చాలా సాదాసీదాగా వ్యవహరించే ప్రముఖులు కొందరు ఉంటారు. అలాంటి వారు అంత సింపుల్ గా ఎలా ఉంటారో అర్థం కాదు. కొన్ని సినిమాల్లో చూసే సీన్ కు మించిన రియల్ రీల్ సీన్ ఒకటి దివంగత బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 జీవితంలో ఉన్నాయి. ఈ మధ్యనే బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత క్వీన్ మీద అభిమానం పెరగటమే కాదు.. ఆమె సింపుల్ సిటీకి ఫిదా అయిపోవటం ఖాయం. ఇంతకూ అసలేం జరిగింది? ఆమెకు సంబంధించిన అరుదైన ఉదంతం గురించి ఎవరు వెల్లడించారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

బ్రిటన్ కు 70 ఏళ్లు క్వీన్ గా ఉన్న ఎలిజిబెత్ 2ను గుర్తించని వారు ఉండరు. ఏదో ఒక సందర్భంలో ఆమె ఫోటోను ప్రతి ఒక్కరు చూసేదే. అలాంటిది ఆమెను గుర్తించని వారు కూడా ఉంటారా? అనొచ్చు. కానీ.. ఉంటారన్న విషయాన్ని ఈ ఉదంతం చెబుతుంది. రాణి పాలన 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ఏడాది జూన్ లో ప్లాటినం జూబ్లీ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్వీన్ కు సంరక్షణాధికారిగా వ్యవహరించి ఇప్పుడు రిటైర్ అయిన రిచర్డ్ గ్రిఫిన్ ఒక ఆసక్తికరమైన.. అరుదైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ ఉదంతం గురించి విన్నతర్వాత విస్మయానికి గురి కాని వాళ్లు ఉండరనే చెప్పాలి.

క్వీన్ ఎలిజిబెత్ కు ఉన్న ఒక అలవాటు ఏమంటే.. ఆమె పిక్నక్ కు వెళ్లినప్పుడు అందరితో కలిసిపోయే గుణం ఉంటుంది. ఒకసారి క్వీన్ స్కాట్లాండ్ లోని బల్మోరల్ క్యాజిట్ సమీపంలోని అబెర్డీన్ షైర్ కు పిక్నిక్ కు వెళ్లారంటూ గ్రిఫిన్ చెబుతూ.. ఆయనేమన్నారన్నది ఆయన మాటల్లో చదివితే బాగుంటుంది.

''మేం వెళ్లిన ప్లేస్ కు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. రాణి ఎలిజిబెత్ కూడా వారిలో కలిసిపోయారు. తనకు ఎదురుపడిన వారిని రాణి ఆగి పలుకరిస్తూ ఉంటారు. అలానే ఆ రోజు కూడా ఒక పర్యాటక టీంకు ఆమె హలో చెప్పారు. వారు రాణిని గుర్తు పట్టలేదు. తాము ఎక్కడి నుంచి వచ్చామో చెబుతూ.. రాణిని ఎక్కడ ఉంటారని అడిగారు. దానికి రాణి రియాక్టు అయి సమాధానమిస్తూ..'నేను లండన్ లో ఉంటాను. సెలవుల్లో నాకు మరో విడిది ఉంది. అది ఆ కొండ పక్కనే' అంటూ చెప్పారు.

అంతులో ఆ టీంలోని ఒక వ్యక్తి కల్పించుకొని.. మీరు ఇక్కడకు తరచూ వస్తుంటారా? అని అడిగారు.. తన చిన్నప్పటి నుంచి.. గత 80 ఏళ్లుగా ఇక్కడకు వస్తూ ఉంటానని అతనికి చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి స్పందిస్తూ.. 'అయితే మీరు రాణిని కలిసే ఉంటారు కదా?' అని అడిగారు. దానికి రాణి నవ్వుతూ.. 'నేను కలవలేదు. కానీ డిక్కీ (గ్రిఫిన్ ముద్దుపేరు) తరచూ ఆమెను కలుస్తుంటారు' అని నన్ను చూపిస్తూ హాస్యమాడేశారు. వెంటనే ఆ టూరిస్టు ఆశ్చర్యపోయి.. నా వైపు తిరిగారు. 'ఆమె ఎలా ఉంటారు?' అని అడిగారు. దానికి నేను స్పందిస్తూ..'కొన్ని సమయాల్లో ఆమె చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు హాస్యచతురత ఎక్కువ' అని చెప్పాను.

అప్పటికి వారు రాణి ఎలిజిబెత్ ను గుర్తించలేదు. ఒక వ్యక్తి అయితే నా భుజం మీద చెయ్యి వేస్తూ..తన కెమేరా ను క్వీన్ చేతికి ఇచ్చి.. తమఇద్దరికి ఫోటో తీయమని అడిగారు.రాణి కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. ఆ వ్యక్తికి ఎలిజిబెత్ ఫోటో తీశాక వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎలిజిబెత్ నాతో మాట్లాడుతూ.. ఆ ఫోటోలు తన ఫ్రెండ్స్ కు చూపించిన తర్వాత ఎవరో ఒకరు నా గురించి తనకు చెబుతారేమో చూద్దాం' అంటూ అప్పట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇదంతా చదివిన తర్వాత.. ఇంత సింఫుల్ గా ఉండే మహరాణి మీద అభిమానం మరింత పెరగటమేకాదు.. ఆమె సింపుల్ సిటీకి అవాక్కు కాకుండా ఉండలేని పరిస్థితి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News