బంధాలకు చెక్.. సాధువులుగా ఇంజనీర్లు

Update: 2019-02-04 11:02 GMT
ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళలకు హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. వారిపై మెమ్స్ - సెటైరికల్ పంచులతో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అందులోని సారాంశం ఏంటంటే.. ‘మీ భర్తలను మీరు కష్టపెట్టకుండా బాగా చూసుకోండి..వారిని హింసించకండి.  మీరు ఇవి పాటించకపోతే వారు సంసార జీవితాలను త్యజించి సాధువుల్లో కలిసిపోతారు జాగ్రత్త..’ అంటూ హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ పోస్టులు వెల్లువెత్తడానికి పెద్ద కారణమే ఉంది. తాజాగా పెళ్లైన పురుషులు - యువ ఇంజనీర్లు సంసార - భవబంధాలను త్యాగం చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. నాగసాధువులుగా మారిపోతున్నారు. అడవులకు వెళుతూ ఆకులు అలములు తింటూ ధాన్యం చేస్తూ కాలం గడుపుతున్నారు. సాధువులుగా మారిపోతున్న పురుషుల సంఖ్య ఈ సంవత్సరం విపరీతంగా పెరిగిపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

తాజాగా ఈ సంవత్సరం యూపీలో మౌని అమావాస్య నాడు నిర్వహించిన  కుంభమేళాలో దాదాపు 10000 మంది యువకులు - యువతులు సాధువులుగా మారేందుకు సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. షాకింగ్ విషయం ఏంటంటే ఈ 10వేల మందిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు - మెరైన్ బయోలాజిక్స్ - మేనేజ్ మెంట్ గ్రాడ్యూయేట్లు  - విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఇలా సాధువులుగా మారే వాళ్లలో హిందువులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే.. ఇందులో ముస్లిం - క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన యువత కూడా ఉండడం గమనార్హం.  ఉక్రెయిన్ - మలేషియా నుంచి వచ్చి మరీ ఇలా సాధువులుగా మారిపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

సాధువులా మారాలంటే వారి భవబంధాలు - ప్రేమానురాగాలు - బంధుత్వాలను వదిలిపెట్టాల్సి రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన వారినే సాధువుగా మారుస్తున్నారు. ఒకసారి సాధువుగా మారాక వారి కామ - క్రోద మద వాత్సాల్యాలకు దూరంగా ఉండాల్సిందే. సాధువు స్వీకరించాక వారు హిమాలయాలు - గుడులు - గోపురాల వెంటే ఉంటూ జీవితాంతం భగవంతుడి ధ్యాసలో బతకాల్సి ఉంటుంది. ఇలా ఇంత మంది చదువుకున్న వారు ఉద్యోగులు - సాధువులుగా మారిపోతున్న వైనం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

ఉద్యోగాల ఒత్తిడి - కుటుంబ సమస్యలు - ఇతరత్రా బిజీ లైఫ్ తోనే యువత ఇలా సాధువులుగా మారిపోతున్నారని తెలుస్తోంది. యువత ఆధునిక పోకడలకు అలవాటై అవి నెరవేరకపోవడం.. వేగాన్ని అందుకోలేకపోవడం.. ఫ్యామిలీ గొడవలు భరించలేకపోతున్నారు. మునుపటిలో ఉమ్మడి కుటుంబాలులేకపోవడం.. ధైర్యం చెప్పే అమ్మమ్మ - నానమ్మలు లేకపోవడం.. ఎవరికీ వారే యమునా తీరే లాంటి జీవితాలు కావడంతో దేన్ని తట్టుకునే పరిస్థితి నేటి ఆధునిక మనిషికి లేకుండా పోతోంది.ధృఢమైన మనస్తత్వం లేకపోవడం వల్లే ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
Tags:    

Similar News