మాట‌ల ‘ఈటెలు’.. ఎవ‌రికి త‌గులుతున్నాయ్‌?

Update: 2021-02-06 03:30 GMT
‘‘నన్ను మంత్రిని చేసింది అమ్మానాన్న కాదు.. రైతులే. నేను ఎల్లప్పుడూ రైతు పక్షపాతినే. కేంద్ర వ్యవసాయ చట్టాలతో రైతులు అభద్రతా భావంలోకి వెళ్లారు. రైతు ఉద్యమానికి.. తెలంగాణ రైతుల మద్దతు కూడా ఉంది.’’ ఇవీ.. వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వేదికలు ప్రారంభించిన ఈటెల.. ఈ సందర్భంగా  మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఈటెల వ్యాఖ్య‌లపై చ‌ర్చ‌..

ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏంటనే చర్చ సొంత పార్టీలో కూడా మొదలైంది. తొలుత‌ రైతు చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా మాట్లాడిన టీఆర్ఎస్.. ఆ త‌ర్వాత కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమైన కేసీఆర్.. ఆ పర్యటన వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో.. అంతర్గతంగా సయోధ్య కుదిరిందా? అనే చ‌ర్చ కూడా సాగింది. ఆ ప్ర‌కార‌మే.. కేంద్ర‌ చ‌ట్టాల‌పై నేత‌లు మాట్లాడే మాటలు మారాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అయితే.. తాజాగా, ఈటెల రాజేంద‌ర్ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడారు. భ‌విష్య‌త్ పై తెలంగాణ రైతులు ఆందోళ‌న చెందుతున్నార‌న్న ఈటెల‌.. ఢిల్లీలో కొన‌సాగుతున్న ఆందోళ‌న‌కు తెలంగాణ రైతుల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

పార్టీ లైన్ దాటారా..?

ఈటెల చేసిన‌ వ్యాఖ్య‌లు పార్టీ లైన్ దాట‌డ‌మేనా? అనే చ‌ర్చ సాగుతోంది గులాబీ ద‌ళంలో. కేసీఆర్‌ ఢిల్లీ టూర్ త‌ర్వాత బీజేపీ ప‌ట్ల గులాబీ పార్టీ వ్య‌వ‌హ‌రించే తీరులో స్ప‌ష్ట‌మైన‌ మార్పు వ‌చ్చింది. తాజాగా.. కేంద్ర బ‌డ్జెట్ పై టీఆర్ఎస్ మౌన‌మే.. ఆ పార్టీ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. బ‌డ్జెట్ లో తెలంగాణకు కేంద్రం ఎలాంటి కేటాయింపులూ చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రాన్ని ప‌ల్లెత్తు మాట అన‌లేదు గులాబీ నేత‌లు. ఇదంతా బీజేపీతో సయోధ్య‌లో భాగ‌మే అంటున్నారు విశ్లేష‌కులు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఈటెల మాట్లాడ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఆవేశ‌మా? వ‌్యూహాత్మ‌క‌మా?

రాజేంద‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఆవేశంతో చేసిన‌వా? వ‌్యూహాత్మంగా చేసిన‌వా? అనే కోణంలో  ఆరాతీస్తున్నారట గులాబీ నేత‌లు.  రైతుల‌ను చూసిన‌ ఆవేశంలో ఈ మాట‌లు మాట్లాడారా? ఉద్దేశ‌పూర్వ‌కంగానే వ్యాఖ్యానించారా? అని చ‌ర్చిస్తున్నార‌ట‌. కాగా.. గ‌తంలోనూ టీఆర్ఎస్ పార్టీ జెండాలో త‌మ‌కూ భాగ‌స్వామ్యం ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఈటెల‌. ఇది అధిష్టానానికి వ్య‌తిరేక సంకేతమా? అనే చ‌ర్చ కూడా జ‌రిగింది అప్ప‌ట్లో. ఇప్పుడు.. తాను మంత్రిగా ఉండొచ్చు.. ఉండ‌క‌పోవ‌చ్చు గానీ.. రైతుల ప‌క్షాన్నే ఉంటాన‌ని అన్నారు‌. ఈ మాట‌ల‌కు అంత‌ర్గ‌త‌ కార‌ణం ఏదైనా ఉందో లేదో తెలియ‌దుగానీ.. రాజ‌కీయంగా మాత్రం చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.
Tags:    

Similar News