మోడీ మాస్టార్ హడావుడి చేసినా...అంతే సంగతులా... ?

Update: 2022-02-02 12:30 GMT
పోరాటం ఏది చేసినా ఫలితం రావాలి. కానీ వర్తమానంలో చూసుకుంటే ఫలితాలు ఏ కోశానా  కనిపించడంలేదు. అన్నీ నోటి మాటలే, కాగితం గీతలే అయిపోతున్నాయి. మహా నాయకులు చెప్పినా కూడా అవి అమలు కాకపోవడమే అతి పెద్ద విషాదం. విషయానికి వస్తే విశాఖకు రైల్వే జోన్ ఇదిగో ఇపుడే ఈ క్షణానే అని  అంటూ ఏకంగా వేడి వేడిగా రిలీజ్ చేసిన ఆర్డర్ కాపీతోనే ఇప్పటికి మూడేళ్ల క్రితం మోడీ విశాఖలో అడుగుపెట్టారు. 2019 మార్చి నెలలో విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ విశాఖ చిరకాల కోరిక సాకారం చేశామని వేలాది జనాల హర్షద్వానాల‌ మధ్య ఆర్భాటంగా ప్రకటించారు.

ఇంకేముంది విశాఖకు రైల్వే జోన్ వచ్చింది అని అంతా పండుగ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆ మీదట మూడు కేంద్ర బడ్జెట్లు వెళ్ళినా కూడా విశాఖ రైల్వే  జోన్ ఊసే లేదు, ధ్యాసే లేదు. ఇపుడు జోన్ కి సంకేతంగా ఏముంది అంటే విశాఖలో ఓఎస్డీ ఆఫీస్ మాత్రమే అని చెప్పుకోవాలి. ఇక జోన్ పేరుతో ఎంతో చరిత్ర కలిగి నూటాభై ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు  ఏర్పాటు చేసిన వాల్తేరు డివిజన్ ని ఎకాఎకీన  ఎత్తేశారు. దాంతో నగర వాసులు ఇదేమిటి అని కూడా మధనపడ్డారు.

రైల్వే జోన్ ఇస్తున్నపుడు ఇది తప్పదంటూ చెప్పారు. ఇపుడు వెనక్కి తిరిగి  చూసుకుంటే జోనూ లేదు, వాల్తేరు వంటి ప్రతిష్టాత్మకమైన డివిజనూ లేదు. అంటే రెండింటికీ చెడ్డగా విశాఖ అయిందా అన్న డౌట్ అయితే జనాలలో  ఉంది. ఇక లేటెస్ట్ బడ్జెట్ లో కూడా జోన్ ఏర్పాటుకు అవసరమైన నిధుల విషయం లేకపోవడంతో నగర వాసులు మండిపోతున్నారు. విశాఖ రైల్వే జోన్ అన్నది ఎవరో చెప్పలేదని, ఏకంగా ప్రధాని విశాఖ వచ్చి ఆర్డర్ ని కూడా చూపించినా అది అమలు కాకపోవడమేంటి అని కూడా నిలదీస్తున్నారు.

విశాఖలో జోన్ ఏర్పాటు కావాలీ అంటే దానికి సరిపడా పెద్ద ఎత్తున  రైల్వే భూములు ఉన్నాయి. మౌలిక సదుపాయల కల్పనకు మాత్రమే చూస్తే  అయిదు వేల కోట్లు కావాలి. కానీ కేంద్రం ఒక్క పైసా విదల్చకపోవడంతో  అయిదు వేల కోట్లు ఎపుడు వచ్చేనూ జోన్ ఎపుడు పూర్తి అయ్యేనూ అన్నదే ప్రశ్నగా ఉంది. మరో విషయం ఏంటి అంటే విశాఖ రైల్వే జోన్ అంటూ కొత్తగా ఏదీ లేదని ఈ మధ్యనే రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ షాక్ ఇచ్చేశారు. అయితే దాని మీద వైసీపీ ఎంపీలు కలసిన మీదట ఆయన జోన్ తప్పక వస్తుదని చెప్పారని వారు చెప్పుకున్నారు.

మరి ఇపుడు చూడబోతే మంత్రి గారి మాటే నిజమయ్యేలా ఉంది అంటున్నారు. ఇక జోన్ కోసం మూడు వందల కోట్లను కేంద్రం ఈ బడ్జెట్ లో రిలీజ్ చేస్తుందని గొప్పగా ప్రకటించిన  వైసీపీ ఎంపీ సత్యవతి కూడా ఇపుడు ఏమీ మాట్లాడలేని సీన్ ఉంది. ఇదిలా ఉంటే జోన్ పేరు చెప్పి బీజేపీ కాలయాపన మాత్రమే చేస్తోంది తప్ప మరేమీ లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యద‌ర్శి జేవీ సత్యనారాయణ మూర్తి ఘాటైన విమర్శ చేశారు.

బడ్జెట్ లో కనీస కేటాయింపులు లేకుండా జోన్ ఎలా వస్తుందో బీజేపీ నేతలే చెప్పాలని కూడా నిలదీశారు. ఇదిలా ఉంటే రైల్వే జోన్ కోసం మళ్లీ పోరాట బాట పడతామని ఆయన హెచ్చరించారు. తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి కేంద్రానికి తెలిసొచ్చేలా భారీ ఉద్యమమే నిర్మిస్తామని అంటున్నారు. ఇవన్నీ సరే కానీ ఇప్పటికి పాతికేళ్లుగా రైల్వే జోన్ కోసం విశాఖ ప్రజలు  ఉద్యమిస్తే బీజేపీ దాన్ని మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇపుడు బడ్జెట్ లో నిధుల కోసం మరో పాతికేళ్ళ ఉద్యమమా అని జనాలు అంటున్నారు. ఇలాగైతే విశాఖకు జోన్ వచ్చినట్లే అని కూడా నిర్వేదంతో చెబుతున్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని బీజేపీ ప్రభుత్వానికి మేధావులు, ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు.
Tags:    

Similar News