భారత్ లో ఈసారి ఎండలు తీవ్రంగా ఉండటానికి కారణం చెప్పిన ప్రముఖుడు

Update: 2022-05-01 07:30 GMT
ఎండాకాలం వచ్చిన ప్రతిసారీ భానుడు చెలరేగిపోవటం.. ప్రజలకు చుక్కలు కనిపించటం మామూలే. అయితే.. ఈసారి మాత్రం గతంతో పోలిస్తే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావటం.. అది కూడా మార్చి నుంచే షురూ కావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఒకవైపు.. వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇదిలా ఉంటే.. మన దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాటి వెనుకున్న కారణాలపై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ ప్రధాన శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూకోల్ తన అభిప్రాయాల్ని వెల్లడించారు.

చరిత్రలో 2022 మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం వెనుక స్థానిక వాతావరణ మార్పులతో పాటు ఇండో -పాక్ ప్రాంతంలో వేడిగాలుల తీవ్రతకు మూల కారణాల్లో ఒకటి గ్లోబల్ వార్మింగ్ గా అభిప్రాయపడ్డారు. మానవ తప్పిదమూ.. మితిమీరిన రీతిలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలు కూడా కారణంగా పేర్కొన్నారు. 1901 నుంచి 2022 వరకు దాదాపు 122 సంవత్సరాల్లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలుగా పేర్కొన్నారు.

ఈ ఏడాది ఉత్తర భారతంలోనూ.. మధ్య భారతంలోనూ వర్షపాతం తగ్గింది. వేడి గాలులు తీవ్ర రూపం దాల్చటానికి ఇదో ప్రధాన కారణంగా పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి రాజస్థాన్ సహా వాయువ్య భారతానికి.. మధ్య భారతానికి.. ఉత్తరాది తర్వాత తూర్పు ప్రాంతానికి ఈ వేడి గాలులు విస్తరిస్తున్నాయి. దీంతో ఒడిశా.. ఏపీ.. తెలంగాణ రాష్టాలు వేడి గాలుల ప్రభావానికి లోనవుతున్నట్లు పేర్కొన్నారు.

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాలుల కారణంగా వడదెబ్బ తగిలి.. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నట్లుగా మాథ్యూకోల్ పేర్కొన్నారు. వడదెబ్బ కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలు నాలుగు దశాబ్దాల్లో 62.2 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. వేడి తీవ్రత కారణంగా పని ఉత్పాదక సామర్థ్యం తగ్గిందని.. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లుగా వెల్లడించారు.

ఒక రిపోర్టును ఆధారంగా తీసుకొని చూస్తే.. 1979 నుంచి 2019 వరకు అంటే నలభై ఏళ్లలో ప్రతికూల వాతావరణాల కారణంగా 1.41 లక్షల మంది మరణించారు. మొత్తం మరణాల్లో 17,362 మంది ఉష్ణోగ్రతల తీవ్రత.. వడగాల్పుల కారణంగా మరణించినట్లుగా పేర్కొన్నారు. మిగిలిన మరణాలు వరదలు.. తుపాన్ల కారణంగా చోటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.
Tags:    

Similar News