ఫేస్‌ బుక్ ఒప్పుకుంది..డాటా దారిమ‌ళ్లింది

Update: 2018-04-05 23:56 GMT
ఎట్ట‌కేల‌కు ఫేస్‌ బుక్ మ‌రో త‌ప్పిదాన్ని ఒప్పుకుంది. ఇండియాలో 5.6 లక్షల మంది ఫేస్‌ బుక్ ఖాతాదారుల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా వాడుకుందని ఫేస్‌ బుక్ వెల్లడించింది. భారత ప్రభుత్వం పంపిన నోటీస్‌ కు ఫేస్‌ బుక్ అధికార ప్రతినిధి స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా వివిధ దేశాల్లో ఆ యాప్ ఎంత మంది యూజర్ల డేటా వాడుకుందో తెలుసుకునే పనిలో ఉన్నామ‌ని వెల్ల‌డించారు. ఫేస్‌ బుక్ డేటాను క్యాంబ్రిడ్జ్ అనలిటికా దుర్వినియోగం చేసిందన్న అంశం ఇప్పుడు సంచలనంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయిదు కోట్ల మంది ఫేస్‌ బుక్ డేటాను క్యాంబ్రిడ్జ్ అనలిటికా 2016లో అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో బ్రిటన్ దేశం ఫేస్‌ బుక్ ఓనర్ జుకర్‌ బర్గ్‌ కు సమన్లు జారీ చేసింది. భారత్ కూడా ఫేస్‌ బుక్ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. భారతీయుల డేటా చోరీ అయితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ మేర‌కు నోటీసులు అందించ‌గా తాజా రిప్లై వ‌చ్చింది.

`గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ లిమిటెడ్‌ కు చెందిన అలెగ్జాండర్ కోగన్ తయారుచేసిన యాప్ ద్వారా ఫేస్‌ బుక్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా సంపాదించింది. మా అనుమతి లేకుండా ఈ డేటాను వాడుకోవడం ఉల్లంఘనే అవుతుంది. ఇండియాలో ఈ యాప్‌ను కేవలం 335 మంది మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అయితే ఇది వాళ్ల స్నేహితుల ద్వారా ఓ చెయిన్‌లా మారి 562120 మందిపై ప్రభావం చూపింది. మొత్తం 562455 మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా కేంబ్రిడ్జ్ అనలిటికా చేతికి వెళ్లింది` అని ఫేస్‌బుక్ తెలిపింది. మరోవైపు తమవైపు నుంచి తప్పు జరిగినా తనకు మరో అవకాశం ఇవ్వాలని ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ కోరారు.

భారత ఐటీ చట్టాలు బలంగా ఉన్నాయని, ఒకవేళ డేటా చోరీ జరిగినట్లు తెలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి రవిశంకర్ జుకర్‌బర్గ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఐటీశాఖ మంత్రి.. ఫేస్‌బుక్ వివాదంపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లో క్యాంబ్రిడ్జ్ అనలిటికాతో ఎందుకు సంబంధాలు ఉన్నాయని ఆయన అడిగారు. ఓటర్లను ఆకర్షించేందుకు క్యాంబ్రిడ్జ్ అనలిటికా భారతీయుల డేటాను చోరీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. బ్రిటీష్ కంపెనీ క్యాంబ్రిడ్జ్ అనలిటికా.. కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం పట్ల కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News