ఫేస్ బుక్.. సోషల్ మీడియాలో 90శాతం మంది కనెక్ట్ అయిన యాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ - ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కొత్త యూజర్లను పెంచుకుంటూనే.. సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఫేస్ బుక్ అనేది జీవితం భాగం అయ్యే విధంగా తన ప్రణాళికలు రచిస్తూనే. ఇందులో భాగంగా బ్రాండ్ బ్యాండ్ పై ఆధారపడుకుండా.. శాటిలైట్ ద్వారా నేరుగా ఫేస్ బుక్ కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తోంది. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ త్వరలో సొంతంగా ఓ ఉపగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ప్రస్తుతం అనేక మందికి ఇంటర్నెట్ సేవలు లభిస్తున్నా మరింత మందికి ఆ మాధ్యమాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆ సంస్థ ఎథేనా అనే ఉపగ్రహాన్ని రూపొందించింది.
2019లో ఈ శాటిలైట్ ను ప్రయోగించాలని ఫేస్ బుక్ భావిస్తోంది - అందుకు గాను ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. నేటి తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పొందలేని వారు ఇంకా అధిక సంఖ్యలోనే ఉన్నారు. దీంతో వారికి కూడా ఇంటర్నెట్ సేవలను అందజేయాలనే లక్ష్యంతో ఫేస్ బుక్ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వద్ద దరఖాస్తు చేసుకుంది. దీని వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి సమర్థవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు వీలవుతుందని ఫేస్ బుక్ భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ - సాఫ్ట్ బ్యాంక్ మద్దతు ఇస్తున్న వన్ వెబ్ అనే రెండు కంపెనీలు ఇప్పటికే కృషి చేస్తుండగా వారి సరసన ఫేస్ బుక్ వచ్చి చేరనుంది. ఇక ఫేస్ బుక్ తాము చేపట్టిన ప్రాజెక్టుకు ఎథేనా అని కూడా నామకరణం చేసింది. అయితే దీని గురించిన ఇతర వివరాలను మాత్రం ఫేస్ బుక్ వెల్లడించలేదు. త్వరలో ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఫేస్ బుక్ సొంత శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్ బాధ ఉండదు. ఎందుకంటే.. మారుమూల ప్రాంతాల్లోనూ ఫోన్ నుంచి నేరుగా శాటిలైట్ కు కనెక్ట్ అయ్యి.. హ్యాపీగా ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వొచ్చు. ఇందుకు కావాల్సిన అనుమతుల కోసం ఇప్పటికే అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ కు దరఖాస్తు కూడా చేసుకుంది. మరో మూడు - నాలుగు సంవత్సరాల్లో శాటిలైట్ టెక్నాలజీ అనేది ఎంతో ముఖ్యం అని.. అందులో భాగంగానే ఈ ప్రయోగం అని స్పష్టం చేసింది.