ఈ కొట్లాటలేంది చంద్రబాబు..?

Update: 2015-09-10 04:33 GMT
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మీద.. పార్టీ క్యాడర్ మీద విపరీతమైన పట్టు ఉంటుందన్న వాదన ఉంటుంది. అందులోకి తెలుగుదేశం లాంటి పార్టీలో అంతర్గత క్రమశిక్షణ ఎక్కువన్న వాదన వినిపిస్తుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నప్పటికి పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నప్పటికీ.. అవేవీ గొడవలు.. కొట్లాటల వరకూ వచ్చింది లేదు.

అనూహ్యంగా ఒకే రోజు ఏపీ లోని రెండు జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు వర్గ రాజకీయాలతో సొంత పార్టీ నేతలే బాహాటంగా బయటకొచ్చి కొట్టుకునే పరిస్థితి. ఏపీలో విపక్షాలేవీ.. అధికారపక్షాన్ని టచ్ చేయవని అనుకున్నారో.. ఏమో కానీ.. ఆ కొరత తీర్చుకుంటూ తమకు తామే కొట్టేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో తిరుగులేని అధికారాన్ని అనుభవిస్తున్న చంద్రబాబు.. తన పార్టీ విషయంలో మాత్రం కంట్రోల్ లో ఉంచటంలో ఫెయిల్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఒక్క బుధవారం నాడు అటు ప్రకాశం జిల్లా చీరాల.. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో అధికారపార్టీకి చెందిన నేతలు గ్రూఫులుగా విడిపోయి రోడ్డు మీద పడి కొట్టుకునే దుస్ధితి.

ప్రకాశం జిల్లా చీరాలలో ఇటీవల పార్టీలో చేరి.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్.. సార్వత్రి ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిన పోతుల సునీత వర్గాల మధ్య.. గొడవ చోటు చేసుకోవటం.. తన్నుకోవటంతో పాటు.. రచ్చ రచ్చ అయ్యింది. ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అవలంగి గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా చీలిపోయి కొట్టేసుకున్న దుస్థితి.

సాగునీటి సంఘం అధ్యక్ష ఎన్నికలు తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తీవ్రతరం చేశాయి. తమ వర్గానికి చెందిన వారే సాగునీటి అధ్యక్షుడిగా నిలవాలంటూ ఎవరికి వారు మండిపడుతూ రెండు వర్గాల వారు కోట్లాటకు దిగటంతో ఎన్నికల సంగతి తర్వాత.. ఈ గొడవ పెద్దదిగా మారింది.

రెండు వర్గాలకు చెందిన వారు రాళ్లతో పరస్పరం దాడి చేసుకోవటంతో ఐదుగురు వ్యక్తులు  గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఇలా పార్టీలో వర్గాలుగా చీలిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం ఈ మధ్య కాలంలో పార్టీలో పెరిగిపోతుందన్న విషయాన్ని పార్టీ అధినేత గుర్తించి.. చర్యలు చేప్టటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకేరోజు రెండు ప్రాంతాల్లో పార్టీ నేతలు గ్రూపులుగా చీలిపోవటం  కొట్టేసుకోవటం బాబు సమర్థతపై నీలినీడలు ప్రసరింపజేస్తాయన్న విషక్ష్న్ని గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News