2023 కల్లా ఎగిరే కారు..ట్రాఫిక్ జామ్ లేకుండా షి'కార్లు'

Update: 2020-08-29 23:30 GMT
ప్రపంచంలో 1903 సంవత్సరానికి ముందు రవాణా వ్యవస్థ అంతగా లేదు. ముందుగా గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, ఆ తర్వాత సైకిళ్లు, రిక్షాల్లో మాత్రమే రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత బ్యాటరీ, పెట్రోలుతో నడిచే వాహనాలు మొదలయ్యాయి. బస్సులు, జీపులు, కార్లు వచ్చిన తర్వాత వాటిలో ఎక్కి ప్రయాణించడమే ఒక అద్భుతం. అలాంటి సమయంలో 1903లో  అమెరికాకు చెందిన  రైట్ బ్రదర్స్ ఏకంగా గాలిలో ఎగిరే విమానాలను కనిపెట్టారు. 1904, 1905 సంవత్సరాల్లో  విమానాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విమాన రంగంలో పలు మార్పులొచ్చాయి. హెలికాప్టర్లు, యుద్ధ విమానాల్లో బోలెడు రకాలు వచ్చాయి. కానీ ఒక్క కల మాత్రం మిగిలిపోయింది. అదే గాలిలో ఎగిరే కారు. ఇక ఆ కల  కూడా తీరనుంది. జపాన్ కు చెందిన స్కై డ్రైవ్ సంస్థ ఎగిరే కారును సిద్ధం చేసి అద్భుతం సృష్టించింది. ప్రపంచంలో ఎగిరే కారు  తయారీపై  పలు  దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఎగిరే కార్లు తయారు చేసే 100 ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జపాన్ కు చెందిన  స్కై డ్రైవ్ సంస్థ శుక్రవారం ఎగురుతున్న తమ కారుకు సంబంధించి వీడియో విడుదల  చేసింది. చుట్టూ అన్నివైపులా.. పైన కూడా నెట్టు కట్టి అందులో టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్న వీడియో విడుదల చేసింది. ఈ కారులో ఒక మనిషి కూర్చొని ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తులో గాల్లో నాలుగు నిమిషాల పాటు చక్కర్లు కొట్టాడు. 2023 కల్లా ఎగిరే కారు సిద్ధం చేస్తామని స్కై డ్రైవ్ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ప్రయాణం అంటేనే నరకం. నగరాల్లో ఎక్కడ చూసినా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కు పోవాల్సి వస్తోంది. అదే ఎగిరే కారు అందుబాటులోకి వస్తే.. ఆ ఆనందమే వేరు. ఎంచక్కా ట్రాఫిక్ లేకుండా గాలిలో చక్కర్లు కొట్టుకుంటూ గమ్యస్థానం చేరుకోవచ్చు. పైగా ప్రమాదాలు, కాలుష్యం కూడా తగ్గిపోతుంది.
Tags:    

Similar News