బీజేపీకి షాక్...నాగం రాజీనామా!

Update: 2018-03-22 14:11 GMT
2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణలో మ‌రింత బ‌ల‌ప‌డాల‌ని భావిస్తోన్న బీజేపీకి గట్టి షాక్ త‌గిలింది. తెలంగాణ బీజేపీలో సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి....బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బీజేపీలో తనకు త‌గినంత ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌ని భావించిన నాగం...ఈ రోజు అనుచ‌రులు - కార్య‌క‌ర్త‌ల‌తో సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కొంతకాలంగా ఈ విషయంపై అసంతృప్తితో ఉన్న నాగం ఎట్ట‌కేల‌కు బీజేపీతో తెగ‌దెంపులు చేసుకునేందుకు మొగ్గు చూపారు. అయితే, నాగం ఏ పార్టీలో చేర‌బోతున్నార‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌ను నాగం త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున నాగం కీలక నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. నాగర్ కర్నూలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ‌డ‌మే కాకుండా, మంత్రిగానూ సేవ‌లందించారు. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల టీడీపీని వీడి `తెలంగాణ నగారా` పార్టీని పెట్టారు. 2013లో బీజేపీలో ఆ పార్టీని విలీనం చేశారు. అయితే, నాగంకు పార్టీలో త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీకి గుడ్ బై చెబుతార‌ని కొంత‌కాలంగా పుకార్లు వ‌స్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఆయ‌న నేడు పార్టీని వీడారు. నాగం...కాంగ్రెస్ లో చేర‌బోతున్నార‌ని పుకార్లు వ‌స్తున్నాయి. అయితే, తాను ఏ పార్టీలో చేర‌బోయేది నాగం త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News