వాయువేగం; ఫిబ్రవరి నాటికి ఫ్లైఓవర్ రెఢీ

Update: 2015-12-05 08:06 GMT
పాలనలో తన మార్క్ చూపించాలన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఇందుకోసం ఆయన పడుతున్న తపన అంతాఇంతా కాదు. ఎంత చేసినా.. విభజన కారణంగా వచ్చిన పడిన కష్టాల్ని తీర్చలేకపోతున్న ఆయన.. తన సర్కారు సమర్థతను నిరూపించేందుకు ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టటం లేదు. దశాబ్దాలుగా విజయవాడ ప్రజలు కోరుకుంటున్న దుర్గగుడి పైకి వంతెన.. రహదారుల నిర్మాణానికి సంబంధించి తాజాగా శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించి బెంజి సర్కిల్ వద్ద శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు.

తాజాగా శంకుస్థాపన చేసిన ఫ్లైఓవర్లు.. రహదారుల నిర్మాణానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతున్నారు. మిగిలిన ఫ్లైఓవర్ల సంగతి ఎలా ఉన్నా.. దుర్గగుడి దగ్గర నిర్మించే ఫ్లైఓవర్ కు సంబంధించి చంద్రబాబు సర్కారు మేజిక్ చేయటం ఖాయమంటున్నారు. ఏళ్ల తరబడి దుర్గ గుడి దగ్గర ఫ్లై ఓవర్ నిర్మించాలని చెప్పినా.. ప్రభుత్వాలేవీ పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. బెజవాడ ఏపీకి తాత్కలిక రాజధాని అయిన నేపథ్యంలో ఫ్లైఓవర్ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొన్నారు.

ఒక ఫ్లైఓవర్ ను శంకుస్థాపన చేసిన తర్వాత.. దాని నిర్మాణానికి నెలల తరబడి సమయం పట్టే అవకాశం ఉందని.. కానీ.. దుర్గగుడి ఫ్లైఓవర్ విషయంలో మాత్రం టెక్నాలజీ అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమం శనివారం జరిగినా.. దానికి సంబంధించిన పనులు ముందే ప్రారంభం అయ్యాయని.. ఫ్లైఓవర్ కోసం ప్రీఫ్యాబ్రికేటెడ్ విధానంలో ముందే తయారు చేసిన వాటిని పెట్టేస్తారని చెబుతున్నారు. దీంతో.. ఫిబ్రవరి నాటికే ఈ ఫ్లైఓవర్ ను పూర్తి చేయాలన్న తలంపులో బాబు సర్కారు ఉంది. ఏపీ రాజధాని అమరావతిని నిర్మించే సత్తా తనకు మాత్రమే ఉందన్న విషయాన్ని ఏపీ ప్రజలకు అర్థమయ్యేలా చేయటానికి ఇలాంటి నిర్మాణాల్ని యుద్ధప్రాతిపదిక పూర్తి చేస్తే.. ఆ ఇమేజ్ ఎంతో లాభిస్తుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. దుర్గగుడి ఫ్లైఓవర్ ను అయితే.. ఫిబ్రవరి.. లేదంటే మార్చిలోపు ప్రారంభించటం ఖాయమంటున్నారు. ఒకవేళ ఇదే కానీ నిజమైతే.. బాబు సర్కారుకు భారీ మైలేజీ రావటం ఖాయం.
Tags:    

Similar News