గగన్‌ యాన్‌ కు అంతా సిద్ధం ...నింగిలోకి వెళ్లనున్న నలుగురు !

Update: 2020-01-02 07:31 GMT
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతోంది. గగన్ యాన్, చంద్రయాన్-3 సహా పలు భారీ ప్రాజెక్టులను చేపట్టబోతోంది. 2019లో భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2.... అతిస్వల్ప తేడాతో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపైకి సాఫీగా దిగాల్సిన ‘విక్రమ్‌ ల్యాండర్‌’... దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒక్క సారిగా కుప్పకూలింది. కొద్దిలో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇస్రోకి మద్దతుగా నిలిచారు.

కొత్త సంవత్సరం తొలిరోజైన బుధవారం ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రయాన్‌-2 విఫలం కావడానికి కారణం ‘వెలాసిటీ రిడక్షన్‌’ వ్యవస్థ వైఫల్యమే అని తెలిపారు. అలాగే ఈ ఏడాది మానవ సహిత ప్రయోగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు శివన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు ఆరంభం అయ్యాయని తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి నలుగురు భారతీయులను ఎంపిక చేశామని అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి అవసరమైన శిక్షణను రష్యా ద్వారా ఇప్పిస్తామని అన్నారు. వారి వివరాలను ఇప్పుడిప్పుడే వెల్లడించలేమని చెప్పారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 400 కిలో మీటర్ల ఎత్తు వరకు మనుషులను తీసుకెళ్తామని, అక్కడి కక్ష్యలోకి వారిని ప్రవేశ పెడతామని అన్నారు.

అలాగే చంద్రయాన్ 3 ద్వారా 2019లో జస్ట్‌ మిస్‌ అయిన చందమామను మళ్లీ పట్టుకుంటామని , చంద్రయాన్‌ 3లో ల్యాండర్‌, రోవర్‌ల తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపెల్షన్‌ మాడ్యూల్‌ తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. కుదిరితే 2020 నవంబరులోనే చంద్రయాన్‌-3 ప్రయోగిస్తాం. చివరిక్షణంలో ఏమైనా మార్పులు జరిగితే తప్ప ఈ కార్యక్రమం వాయిదా పడదు అని శివన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న శ్రీహరికోటకు అదనంగా మరో ప్రయోగ కేంద్రాన్ని నిర్మించబోతున్నామని శివన్ తెలిపారు. దీనికోసం తమిళనాడులోని తూత్తుకుడి వద్ద అవసరమైన భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. తూత్తుకుడి సముద్రతీర ప్రాంతంలో ఈ సరికొత్త ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. శ్రీహరికోటతో పాటుగానే తూత్తుకుడి నుంచీ ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పారు.


Tags:    

Similar News