బీ అలెర్ట్: బంకుల్లో పెట్రోల్ కాజేస్తున్నారు

Update: 2021-09-13 09:42 GMT
లీటర్ పెట్రోల్ 110కి చేరువలో ఉంది. డీజిల్ కూడా వందకు దగ్గరవుతోంది. పెట్రో ధరల తాకిడికి తట్టుకోలేని కొందరు బైక్ లు కొనడం మానేస్తున్నారు. వీలైన వాళ్లు సైకిళ్లను కొనుక్కొంటున్నారు. ఓ వైపు పెట్రో ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు బంకుల్లో జరిగే మోసాలతో బెంబేలెత్తుతున్నారు. లీటర్ పెట్రోల్ కొట్టమంటే 800 మిల్లిలీటర్లు పోస్తున్నారు.  5 లీటర్ల పెట్రోల్ పోయమంటే 120 మిల్లీ లీటర్లు తగ్గిస్తున్నారు. ఇలా రోజుకు దాదాపు 7 వేల లీటర్ల పెట్రోల్ వరకు మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణ,ఏపీలో పెట్రో ముఠాలతో జనం జేబులు గుళ్లవుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో వీరు చేసే మోసాలతో వినియోగదారులు అధికంగా డబ్బులు చెల్లించి తక్కువ పెట్రోల్ పొందుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల కేంద్రాలుగా పెట్రో ముఠాలు ఏర్పడి ఈ దందా నడిపిస్తున్నారు. వీరికి చైనా నుంచి కొందరు సహకారం అందిస్తున్నట్లు సమాచారం. నిత్యం పెట్రో తూనిక-కొలతల శాఖ తనిఖీలు నిర్వహిస్తున్నా టెక్నాలజీని ఉపయోగించుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు.

పెట్రో బంకుల్లోని నిల్వలు వినియోగదారులకు అందించేందుకు పెట్రో మిషన్లో నాలుగు వ్యవస్థలుంటాయి. కీబోర్డ్, పల్సర్ బోర్డ్, మదర్ బోర్డ్, డిస్ ప్లే బోర్డు. వినియోగదారుడికి ఎంత పెట్రోల్ కావాలో అడగ్గానే అక్కడున్న ఆపరేటర్ కీబోర్డులో నమోదు చేయగానే వెంటనే పల్సర్ బోర్డుకు సందేశం వెళ్లి అక్కడున్న నిల్వల నుంచి పెట్రోల్ బైక్ ట్యాంకులోకి వెళ్తుంది. అయితే బంకుల్లో ఉన్న నిల్వలు గురించి డిస్ ప్లే బోర్డు చూపించాలి. కానీ పెట్రో ముఠాలు ఈ వ్యవస్థలను టాంపరింగ్ చేస్తున్నారు.

పల్సర్ బోర్డు, మదర్ బోర్డు మధ్య లేదా కీబోర్డుకు ప్రత్యేక చిప్ ను అమరుస్తున్నారు. దీంతో వినియోగదారుడు అడిగిన 5 లీటర్లు అని చెప్పినా ఆపరేటర్ 5 లీటర్లు ప్రెస్ చేస్తే 4.5 లీటర్లకే సందేశం వెళ్తుంది. అంటే 500 మిల్లి లీటర్ల పెట్రోల్ కోల్పోతాడన్నమాట. ఇలా పెట్రోల్ కొట్టించుకున్న తరువాత ఓ వినియోగదారుడికి అనుమానం వచ్చి అధికారులను సంప్రదించాడు. దీంతో హైదరాబాద్ లోని ఓ బంక్ లో జరిగిన మోసాన్ని అధికారులు గుర్తించారు. దీంతో చిప్ లను అమరచేందుకు వీలుగా సరికొత్త టెక్నాలజీతో పరికరాలను అమర్చారు. అయితే కొన్ని పెట్రోల్ బంకులు మాత్రం దోపిడీని ఆపడం లేదు.

అయితే బంకుల్లో జరిగిన మోసాల తరువాత కొందరు  అధికారులు ఆ పెట్రోల్ బంకుల్లో కొత్త టెక్నాలజీతో రూపొందించిన పరికరాలను అమర్చారు. అయితే అధికారుల్లో కొందరు మార్చిన టెక్నాలజీని అక్రమార్కులకు లీక్ చేయడం ద్వారా వారు మారిన పరికరాలను అనుగుణంగ చిప్ లను తయారు చేస్తున్నారు. వీరికి చైనా నుంచి కొందరు సహకారం అందించి అక్కడి నుంచి చిప్ లను తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత యాజమాన్యం కలిగిన పెట్రోల్ బంకుల కంటే లీజుకు తీసుకున్న బంకుల్లో ఇలాంటివి ఎక్కువగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

వినియోగదారులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొట్టించుకున్నవారి వద్దే మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా 10 లీటర్ల పెట్రోల్ పోయగా 50 మిల్లీ లీటర్ల పెట్రోల్ ఆవిరై పోతుంది. అయితే 500 మిల్లీ లీటర్ల వరకు తక్కువ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే తక్కువ మొత్తంలో కాకుండా ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొన్న వారిపైనే  భారం పడేట్లుగా చిప్ లను అమర్చారు. ఇక కొందరు కార్లలో ఉండి పెట్రోల్ పోయించుకునేవారిలో కొత్త రకం మోసం చేస్తున్నారు. వినియోగదారులు కారులోనే ఉండగా సగం  వరకు పెట్రోల్ పోసి అపేస్తున్నారు. మిగతా సగం ఆపేసి ఇతర వాహనాలకు నింపుతున్నారు. అయితే తొందరలో వినియోగదారులు చూసుకోకపోవడం కొందరికి లాభం చేకూరుతుంది.
Tags:    

Similar News