డిజిటల్ ఇండియాకు సహకరించాం.. 936 కోట్ల జరిమానాపై గూగుల్ కౌంటర్?

Update: 2022-10-26 10:16 GMT
ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ భారత్ లో నిబంధనలు పాటించడం లేదంటూ భారత ప్రభుత్వ 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)' రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్ కాసింత నొచ్చుకొని కౌంటర్ ఇచ్చింది. తొలిసారి స్పందించింది.  తాము డిజిటల్ భారత్ అవతరణకు దోహదం చేశాయని.. డిజిటల్ భారత్ కు తాము ఎంతో సహకరించామని.. అలాంటి తమకు జరిమానా ఇవ్వడాన్ని గూగుల్ పరోక్షంగా ప్రశ్నించింది.

గూగుల్ వినియోగదారులు, డెవలపర్లకు తాము మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. సీసీఐ 936.44 కోట్ల జరిమానా విధింపు అన్యాయం అన్నట్టుగా మాట్లాడింది.  సీసీఐ నిర్ణయంపై పున: సమీక్షించాలని కోరింది.

ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే అందించే సాంకేతికత, భద్రత, వినియోగదారు రక్షణలు, అసమానమైన ఎంపికలు, సౌలభ్యం నుంచి భారతీయ డెవలపర్లు ప్రయోజనం పొందారు.  ఖర్చులను తక్కువగా ఉంచడం ద్వారా, మా మోడల్ భారతదేశ డిజిటల్ పరివర్తనకు శక్తినిచ్చింది. కోట్ల మందికి డిజిటల్ సాధనాలను చేరువ చేసిందని గూగుల్ ప్రతినిధి తెలిపారు. తమపై జరిమానా విధించడాన్ని తప్పుపట్టింది.

గూగుల్ ప్లే స్టోర్ లో వేరే యాప్ లను గూగుల్ తొక్కేస్తుందన్న ఆరోపణలున్నాయి. ప్లే స్టోర్ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ఇతర యాప్ ల వారు ఫిర్యాదులు చేశారు. దీంతో సీసీఐ ఈ భారీ జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా నిర్ధేశిత సమయంలోగా తన ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా గూగుల్ కు సీసీఐ ఆదేశించింది.

గూగుల్ పై సీసీఐ కొరఢా ఝలిపించడం గత రెండు వారాల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. పలు విపణుల్లో, ఆండ్రాయిడ్ మొబైళ్ల విభాగంలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందున సీసీఐ ఇప్పటికే అక్టోబర్ 20న రూ.1337.76 కోట్ల జరిమానా వేసింది. తాజాగా మరోసారి గూగుల్ కు 936 కోట్ల ఫైన్ వేసి అనైతిక విధానాలు చెల్లవంటూ హెచ్చరికలు పంపింది.దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు గూగుల్ సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News