ఆగమ్మ లు ఆగమాగం చేసేస్తున్నారే

Update: 2015-11-09 03:57 GMT
తెలంగాణ అధికారపక్షానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం తమదేనని.. గెలుపు గురించి అస్సలు సందేహాల్లేవని.. తమ దృష్టి మొత్తం మెజార్టీ మీద మాత్రమేనంటూ చేస్తున్న వ్యాఖ్యలకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆ నేత.. ఈ నేత అన్న తేడా లేకుండా టీఆర్ ఎస్ కు చెందిన నేతలు ఎవరు ఎదురైనా.. ఎవరూ సమావేశాన్ని నిర్వహించినా ఎవరో ఒకరు కడిగేస్తున్నారు. ప్రశ్నల వర్షంలో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. తెలంగాణ సర్కారుపై తమకున్న అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తూ.. నేతల నోటి నుంచి మాట రాకుండా చేస్తున్నారు.

ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలతో టీఆర్ ఎస్ నేతలు విస్తుపోతున్నారు. వరంగల్ ఉప ఎన్నిక తాము అనుకుంత తేలిగ్గా అయ్యే అవకాశం లేదన్న విషయం వారికిప్పుడు అర్థమవుతోంది. ఎన్నికల కోసం నిర్వహిస్తున్న సభల్లో ఎవరో ఒకరు నేతల్ని నిలదీయటం.. సమస్యల్ని ప్రస్తావించటం.. ఇదేనా పాలన? అంటూ సూటిగా ప్రశ్నించటంతో నేతలు నీళ్లు నమిలే పరిస్థితి. పలుచోట్ల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు అధికారపక్ష నేతల నోటి నుంచి మాట రాక.. నీళ్లు నమిలే పరిస్థితి.

గత కొద్ది రోజులుగా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్ నేతలకు పరాభవం ఎదురవుతోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. మంత్రి హరీశ్ రావు.. ఎమ్మెల్సీ పల్లా రాజేశర్.. కొందరు ఎమ్మెల్యేల్ని నిలదీసిన వరంగల్ ప్రజానీకం.. ఆదివారం మరికొందరు అధికారపక్ష నేతల్ని కడిగిపారేశారు.

ఆదివారం ఒక్కరోజులో మంత్రి ఇంద్రకర్ రెడ్డి.. ఎమ్మెల్యే రాజయ్య.. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిలకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. లింగాల ఘణపురం మండలం.. గుమ్మడవెళ్లి ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతుంటే.. గోసంగి ఆగమ్మ అనే మహిళ ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డు తగిలింది. ‘‘మీ లీడర్లంతా మస్తుగా మాట్లాడతరు. నా భర్త ఎల్లయ్యకు గప్పుడు నెలకు రెండొందల పింఛనొచ్చేది. తెలంగాణ ఒచ్చినంక ఉన్న పింఛన్ తీసేసిండ్రు. మల్ల మీరొచ్చి కారు గుర్తుకు ఓటెయ్యమంటే మేమెట్ల ఏస్తం. ముందు పింఛను ఇయ్యండి’’ అంటూ నిలదీసింది. దీంతో.. ఆయన ఆగమ్మకు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఆగమ్మ ప్రశ్నల వర్షానికి ఎమ్మెల్యే రాజయ్య ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆమెకు సర్ది చెప్పేందుకు ఆయన మహా ఇబ్బందికి గురయ్యారు.

ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సాగు నీటి కోసం.. విద్యుత్తు కోసం.. నీళ్ల కొరత మీద వారు తమ సమస్యల్ని అధికారపక్ష నేతల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ అధికారపక్ష నేతల్ని తమ ప్రశ్నలతో హడలెల్తించారు. మొత్తంగా చూస్తే.. ‘ఆగమ్మ’ లాంటి వారెందరో.. తెలంగాణ సర్కారును ఆగమాగం చేస్తున్నారన్న మాట అధికారపక్ష నేతల మాటల్లో వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News