వైసీపీకి బ్యాక్ బోన్... పార్టీ కోసం గౌతం ఏం చేశారంటే... ?

Update: 2022-02-21 08:30 GMT
ఏ పార్టీకైనా అధికారంలోకి రావాలన్నా, పది కాలాలు మనుగడ సాగించాలన్నా కూడా సమర్ధత  చిత్తశుద్ధి కలిగిన నాయకులు చాలా అవసరం. అలాగే ఆ పార్టీ తమ సొంతం అని భావించే వారు ఉండాలి. వైసీపీకి అలాంటి నేతల్లో దివంగత యువ మంత్రి గౌతం రెడ్డి ఒకరు అని చెప్పాలి. ఆయన వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా  చురుకుగా ఉన్నారు. ఒక విధంగా సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఇక జగన్ వెంట ఆయన నడచి వచ్చారు. ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా గెలిచారు. నాడు తండ్రి విజయం వెనక గౌతం రెడ్డి కృషి ఎంతో ఉంది.

మరో వైపు చూస్తే జగన్ కి సమవయస్కుడు అయిన గౌతం రెడ్డి ఆయనతో ఎపుడూ  చనువుగా ఉంటూ వచ్చారు. ఒక విధంగా జగన్ నమ్మి ఆత్మీయతను పంచే కొద్ది మంది నేతలలో గౌతం రెడ్డి కూడా ఒకరని చెప్పాలి. ఆయన సైతం పార్టీ కోసం పూర్తి స్థాయిలో పాటుపడేవారు. ఆరు నూరు అయినా వైసీపీ జెండా రెపరెపలాడాలని కోరుకునేవారు. నెల్లూరు జిల్లాలో వైసీపీని పటిష్టంగా ఉంచాలని తపన పడిన నాయకుడిగా ఉన్నారు.

ఇక ఏపీలో వైసీపీ విస్తరణకు సంబంధించి వ్యూహాలను రూపొందించడంలో కూడా గౌతం రెడ్డిది కీలకమైన పాత్ర. జగన్ తో ఉన్న చనువుతో ఆయన విలువైన సలహాలు సూచనలు ఇచ్చేవారని చెబుతారు. అదే విధంగా ఆ స్వేచ్చను వినియోగించుకుని పార్టీని మరో మెట్టు ఎక్కించాలని తరచూ ఆరాట‌పడేవారు అని కూడా అంటారు.  ఇదిలా ఉంటే గౌతం రెడ్డికి తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

దాంతో పాటు సీనియర్ మోస్ట్ నేత కేవీపీ రామచంద్రరావు తో కూడా సన్నిహితమైన పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆయన్ని ఎన్నో సార్లు వైసీపీలోకి రావాలని గౌతం రెడ్డి వత్తిడి తెచ్చేవారు అని అంటారు. ఇది నిజమని స్వయంగా కేవీపీ రామచంద్రరావు మీడియాకు చెప్పారు.

గౌతం రెడ్డి పార్ధివ కాయాన్ని దర్శించి నివాళి అర్పించిన సందర్భంగా కేవీపీ మీడియాతో  మాట్లాడుతూ గౌతం రెడ్డి తనకు చాలా దగ్గరివాడు అని చెప్పుకొచ్చారు. వైసీపీలోకి మీరు రావాలి, మీలాంటి పెద్దవారి ఆశీస్సులు, మారదర్శకత్వం  వైసీపీకి కావాలని గౌతం రెడ్డి తనను బాగా వత్తిడి చేసేవారు అన్న నిజాన్ని కేవీపీ చెప్పడం విశేషం. ఒక విధంగా పెద్దల పట్ల వినయ విధేయతలు ఉండడమే కాకుండా పార్టీ భవిష్యత్తు కోసం ఆయన చూపే చొరవ ఆలోచనలు ఇవన్నీ కూడా కేవీపీని వైసీపీలోకి  ఆహ్వానించడం ద్వారా వెలుగు చూశాయనుకోవాలి. మొత్తానికి గౌతం రెడ్డి లాంటి యువ నేత మరణం వైసీపీకి, ప్రత్యేకించి జగన్ కి తీరని లోటు అనే అంటున్నారు.

ఇక దుబాయ్  వెళ్లే ముందు జగన్ తో చెప్పి వెళ్ళిన గౌతం రెడ్డి వారం రోజుల పర్యటనను ఆదివారంతో ముగించుకున్నారు. ఇక సోమవారం తన పర్యటన విశేషాలను ముఖ్యమంత్రితో స్వయంగా పంచుకోవాల్సిన వేళ ఆయనే నిర్జీవంగా ఉండడం బాధాకరం. ఆయన్ని చూసేందుకు జగన్ హైదరాబాద్ రావడం అంటే నిజంగా ఇది మాటలకు అందని విషాదమే అని వైసీపీ నేతలు అంటున్నారు.
Tags:    

Similar News