హెచ్1బీ వీసాల వారికి పెను పరీక్ష పెట్టిన కరోనా?

Update: 2020-03-31 05:43 GMT
కరోనా కలకలం ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని అంతో ఇంతో ప్రభావితం చేస్తోంది. దాని ప్రభావానికి లోనుకాని వారెవరూ లేరేమో? అంతకంతకూ విరుచుకుపడుతున్న కరోనాతో కొత్త కష్టాలు క్యూ కట్టి మరీ మనుషుల్ని చుట్టు ముట్టేస్తున్నాయి. నెల క్రితం వరకూ చుట్టూ ఉన్న ప్రపంచం కలర్ ఫుల్ గా కనిపించిన వారంతా ఇప్పుడు తమ పరిస్థితిని తలుచుకొని కుమిలిపోతున్నారు. రానున్న రోజులు మరెలా ఉంటాయోనని వణుకుతున్నారు.

గడిచిపోయిన కాలానికి మించింది మరేదీ లేదన్న భావన వారిలో అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అమెరికాలోని హెచ్ 1 బీ వీసాల మీద ఉన్న వారికి ఊహించని కష్టాన్ని తెచ్చి పెట్టింది కరోనా. ఆ దేశంలో ఈ వీసాల మీద ఉద్యోగాలు చేసే వారిలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. కరోనా దెబ్బకు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉండటంతో.. హెచ్ 1బీ వీసాదారులు కూడా అందులో చిక్కకుంటారని చెబుతున్నారు.

గతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. వేరే ఉద్యోగం చేసుకోవటానికి అవకాశాలు ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి కష్టమని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ వీసాల గడువు ముగిసే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. వీసా నిబంధనల ప్రకారం.. గడువు తీరిన తర్వాత వారు.. వారి స్వదేశాలకు వెళ్లిపోవాలి. కరోనా కారణంగా ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలన్ని తమ సర్వీసుల్ని ఆపేసిన వేళ.. వారు తిరిగి వెళ్లలేని పరిస్థితి.

ఇలాంటి కష్టాలతో హెచ్ 1బీ వీసాదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికిప్పుడు తాము తిరిగి వెళ్లలేని ప్రత్యేక పరిస్థితులు ఉన్నందున.. తమ వీసాల్ని  కనిష్ఠంగా మూడు నెలలు.. గరిష్ఠంగా ఆరు నెలలు పొడిగించిన పక్షంలో ఎవరి దారి వారు చూసుకునే వీలుందన్న వాదనను వినిపిస్తూ ఆన్ లైన్ లో 20వేల మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వైట్ హౌస్ కు సమర్పించారు. ఎన్నికల సంవత్సరం కావటంతో.. దీనికి తోడు కరోనా నేపథ్యంలో ఈ వినతిని వైట్ హౌస్ ఓకే చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News