హెచ్‌1బీ ఉద్యోగులకు అమెరికా తీపిక‌బురు

Update: 2017-12-13 17:17 GMT
హెచ్‌1బీ వీసాదారుల‌కు ఊహించ‌ని తీపిక‌బురు. ఈ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చునని ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలోని పలు సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలంటే సదరు ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఏటా భారత్‌ - చైనా లాంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్తున్న వేలాదిమంది నిపుణులు ఈ వీసాపై అక్కడ ఉద్యోగం పొందుతున్నారు. అయితే ఈ వీసా ఉన్నవారు సాధారణంగా తమ దేశంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో విధులు నిర్వహించవచ్చని  హెచ్‌1బీ వీసాలకు అనుమతినిచ్చే యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌ సీఐఎస్‌) స్పష్టంచేసింది.

‘హెచ్‌1బీ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేసుకోవచ్చు. కానీ ప్రతి కంపెనీ కోసం ఐ-129 ధ్రువీకరణ తప్పనిసరి’ అని యూఎస్‌ సీఐఎస్‌ ట్విట్టర్‌ లో తెలిపింది. కొత్త ఉద్యోగులు ఈ ఐ-129 పిటిషన్‌ తప్పనిసరిగా సమర్పించాలని, ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసని పేర్కొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 65వేల హెచ్‌1బీ వీసాలను మాత్రమే జారీ చేస్తారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలు - లాభాపేక్ష లేని పరిశోధన సంస్థల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ పరిమితి వర్తించదు.వారికి అదనంగా ఈ వీసాలు అందిస్తారు.

భార‌త‌దేశం నుంచి చాలామంది ఉద్యోగులు హెచ్‌1బీ వీసా కోసం పోటీపడుతుంటారు. 65వేల వీసాల్లో మొదటి 20వేల వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్‌ డిగ్రీ లేదా అంతకన్నా ఉన్నతమైన చదువులు పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. 2015లో జారీ అయిన ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డుల్లో 44శాతం వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జారీ కాగా - మిగిలిన 56శాతం సదరు ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారికే జారీ అయ్యినట్లు ప్రముఖ అమెరికన్‌ విశ్లేషణ సంస్థ ‘క్యాటో ఇనిస్టిట్యూట్‌’ తన నివేదికలో వెల్లడించింది.  అదే ఏడాది కోటాతో సంబంధం లేకుండా 76,711 నైపుణ్యం కలిగిన వలసదారులు గ్రీన్‌కార్డ్‌ పొందారని పేర్కొన్నది. మొత్తంగా 2015లో ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డ్‌ పొందిన వారిలో 85శాతం మంది అప్పటికే అమెరికాలో కొలువులు చేసుకుంటూ నివసిస్తున్నారని క్యాటో ఇనిస్టిట్యూట్‌ తెలిపింది.
Tags:    

Similar News