పవన్, చంద్రబాబు కలిస్తేనే పనవుతుంది.. హరిరామ జోగయ్య సర్వే

Update: 2023-05-18 12:29 GMT
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అందరూ గెలుపు లెక్కలేసుకుంటున్నారు. అందుకోసం రకరకాల ఈక్వేషన్లు టెస్ట్ చేస్తున్నారు. మొత్తంగా అయితే.. వైసీపీని ఓడించాలంటే చంద్రబాబు, పవన్‌లు కలవాల్సిందేనని టీడీపీలో ఒక వర్గంతో పాటు కాపులు కూడా చాలామంది భావిస్తున్నారు. తాజాగా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య పశ్చిమ గోదావరి జిల్లా వరకు చేసిన ఓ సర్వే వివరాలు వెల్లడించారు.

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే పశ్చిమగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆయన అంచనా వేశారు. 15 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు టిడిపి జనసేన కూటమి దక్కించుకుంటాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రిలీజ్ చేశారు. ఈ జిల్లాలో వైసీపికీ సింగిల్ సీటు కూడా రాదన్నారు.

జనసేనకు అండగా ఉండే కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండటం, జనసేనని బలపరిచే బిసి, ఎస్‌సి సామాజికవర్గంతోపాటు జనసేనకి బలమైన అభ్యర్థులు ఉండటం ఈ క్లీన్ స్వీప్‌కి కారణాలుగా జోగయ్య చెప్పారు. వైఎస్సార్‌సిపి ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఉండటం కూడా జనసేన విజయాలకి కారణంగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు.

ఓటర్ల సంఖ్యాబలంతోపాటు బలమైన అభ్యర్థులు ఉన్న నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, ఆచంట, ఏలూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఖాయమని జోగయ్య వివరించారు. అలాగే టీడీపీకి దెందులూరు, పాలకొల్లు నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయని జోగయ్య తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల విషయానికి వస్తే జనసేనకి నర్సాపురం, రాజమండ్రి, టిడిపికి ఏలూరు నియోజకవర్గంలో అనుకూలంగా ఉందని జోగయ్య తెలిపారు.

కాగా రెండు నెలల కిందట కూడా జోగయ్య పేరుతో రాష్ట్ర వ్యాప్త సర్వే ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలయ్యేనాటికి లెక్కేస్తే జనసేన పార్టీకి 15 సీట్లు, టీడీపీకి 65 సీట్లు, వైఎస్సార్‌సీపీకి 95 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అదే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తయ్యేనాటికి జనసేన పార్టీకి 40 సీట్లు, తెలుగుదేశం 55 సీట్లు, వైఎస్సార్‌సీపీ 80 వస్తాయని అప్పట్లో అంచనా వేశారు.

ఇప్పుడు పాత పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేనలు క్లీన్ స్వీప్ చేస్తాయని ఆయన సర్వే తేల్చింది. దీతో తూర్పుగోదావరిలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుందన్న అంచనాలు జనసేన నేతల నుంచి వ్యక్తమవుతోంది. అయితే.. ఈ రెండు జిల్లాలలో మెజారిటీ సీట్లు జనసేనకు ఇస్తేనే ఇలాంటి ఫలితాలు వస్తాయని కాపు నేతలు అంటున్నారు.

Similar News