ఓటుకు నోటుకు రికార్డులు బయటకు తీసి బాబు పనిపడతాం

Update: 2018-11-04 16:56 GMT
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తెలంగాణ మంత్రి, టీఆరెస్ నేత హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ఓడించే లక్ష్యంతో చంద్రబాబు కాంగ్రెస్‌త్ చేతులు కలిపారని.. ఆయన పప్పులు ఉడకబోవని అన్నారు. ఇప్పటికే కేసీఆర్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు.
    
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నష్టం చేసే ఆలోచనలో ఉన్నారని.. అలాంటి పిచ్చి వేషాలు వేస్తే  చంద్రబాబు సంగతి చూస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న రికార్డులు ముందుముందు బయటపెడతామని చెప్పారు. దీంతో హరీశ్ ఓటుకు నోటు కేసును ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది. టీఆరెస్ ప్రభుత్వం తమ వద్ద అన్ని ఆధారాలు పెట్టుకుని చంద్రబాబును ఇంతకాలం కాపాడుతూ వచ్చిందని.. ఇప్పుడు ఎన్నికలు రావడం.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడంతో ఆ ఆధారాలను చూపించి చంద్రబాబును హెచ్చరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
    
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మద్యం, చంద్రబాబు ఇస్తున్న డబ్బులు వద్దని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు. అమరావతి నుంచే కాంగ్రెస్ పార్టీకి టిక్కెట్లు, నోట్ల కట్టలు, స్క్రిప్ట్ వస్తోందని హరీష్ రావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంటే తెలంగాణలో చంద్రబాబుతో ప్రచారం చేయించాలని సవాల్ చేశారు. మరోవైపు హరీశ్ కాంగ్రెస్ పార్టీనీ ఏకిపడేశారు. తమ పాలనలో రూపాయి ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు ఎందుకు వేస్తారని హరీష్ రావు అన్నారు. పింఛన్ ఇచ్చే తమ పార్టీకే ఓటు వేస్తారన్నారు.


    

Tags:    

Similar News