హ‌రీశ్ స‌మ‌ర్పించు.. సెల్ హిత‌బోధ‌

Update: 2017-12-05 05:19 GMT
నిత్యం రాజ‌కీయాలు మాత్ర‌మే మాట్లాడే తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు ఇప్పుడు కొత్త త‌ర‌హా ప్ర‌చారాన్ని మొద‌లెట్టారు. ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. సెల్ క‌ష్టాలు.. న‌ష్టాలుఎంత‌లా ఉంటాయో చెప్పుకొచ్చారు. త‌న అడ్డా అయిన సిద్ధిపేట‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న సెల్ ఫోన్ అదే ప‌నిగా వాడ‌టంతో వ‌చ్చే ఇబ్బందుల గురించి ఏక‌రువు పెట్టారు.

సెల్ ఫోన్ మీద ఆయ‌న చేసిన హిత‌బోద అక్క‌డి వారిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. సెల్ ఫోన్ విరివిగా వాడ‌టంతో క‌లిగే అన‌ర్థాల్ని వివ‌రించిన ఆయ‌న‌.. సెల్ ఫోన్ ఎక్కువ‌గా వాడొద్ద‌ని చెప్పారు. సెల్ వాడ‌కం పెరిగిన కొద్ది  జ్ఞాపకశక్తి  త‌గ్గుతుంద‌న్న ఆయ‌న‌.. ఎదురుగా మ‌నిషి ఉన్నా వారి పేరు నోటి చివ‌ర‌నే ఉన్నా.. మ‌రిచిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు. అలాంటి సంద‌ర్బాల్లో ఎవ‌రైనా త‌ప్పులు మాట్లాడితే కామెడీ చేయొద్ద‌న్న సూచ‌న చేశారు.

తెల్లారి లేచింది మొద‌లు రాత్రి నిద్ర‌పోయే వ‌ర‌కూ అదే ప‌నిగా ఫోన్ వాడ‌టంతో శారీర‌కంగా త్వ‌ర‌గా అలిసిపోతున్నామ‌ని. మాన‌సికంగా ఒత్తిడికి గురి అవుతున్నామ‌ని చెప్పుకొచ్చారు. చూస్తుంటే.. హ‌రీశ్ సెల్ క‌ష్టాలు ఏక‌ర‌వు పెడుతున్న‌ట్లు లేదు. ఏమైనా.. సొల్లు రాజ‌కీయాల గురించి అదే ప‌నిగా మాట్లాడే కంటే.. జ‌న జీవితాల‌కు ఉప‌యోగ‌ప‌డే ఇలాంటి మాట‌లు ఎంతోకొంత మేలు చేయ‌టం ఖాయం. ఈ మాట‌ల‌తో పాటు.. వారంలో ఒక‌ట్రెండు రోజులు సెల్ ఫోన్ ను ప‌రిమితంగా మాట్లాడాల‌న్న రూల్ పెట్టుకోవాల‌న్న సూచ‌న‌లు చేస్తే మంచిదేమో. ఇవాల్టి రోజున సెల్ ఫోన్ ను మొత్తంగా ఆపేయ‌మ‌ని అడిగే ప‌రిస్థితి లేదు. అందుకే.. నియ‌మంగా పెట్టుకున్న రోజుల్లో ఐదు ఫోన్ కాల్స్ లేదంటే ప‌ది ఫోన్ కాల్స్ మాట్లాడాల‌ని అది కూడా అన్నికాల్స్ పావు గంట వ్య‌వ‌ధిలోనే ముగించాల‌న్న రూల్ పెట్టుకుంటే మంచిదన్న మాట‌ల్ని చెబితే బాగుంటుందేమో.
Tags:    

Similar News