కాళేశ్వ‌రం కావాలా? శ‌నేశ్వ‌రం కావాలా?

Update: 2018-12-02 09:52 GMT
టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత హ‌రీశ్ రావు మ‌రోసారి త‌న పదునైన విమ‌ర్శ‌ల‌తో ప్ర‌జా కూట‌మిపై విరుచుకుప‌డ్డారు. టీఆర్ ఎస్‌ కు ఓటేస్తే తెలంగాణ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మిస్తామ‌ని అన్నారు. కూట‌మికి ఓటేస్తే మాత్రం శ‌నేశ్వ‌ర‌మే గ‌తి అవుతుంద‌ని పేర్కొన్నారు. ఎవ‌రికి ఓటెయ్యాలో తేల్చుకోవాల‌ని సూచించారు.

భువ‌న‌గిరి - బొమ్మ‌ల రామారంల‌లో శ‌నివారం హ‌రీశ్ రావు భారీ రోడ్ షోలు నిర్వ‌హించారు. టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు పైళ్ల శేఖ‌ర్ రెడ్డి - సునీత‌(ఆలేరు)ల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఈ స‌భ‌ల్లో హ‌రీశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు - ఉద్యమకారులకు మ‌ధ్య ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఎవరికి పట్టం కట్టాలో ప్రజల‌కు తెలుసున‌ని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వ‌స్తుంద‌ని.. కూట‌మి గెలిస్తే శ‌నేశ్వ‌ర‌మే గ‌త‌వుతుంద‌ని అన్నారు. గత పాలకుల హయాంలో కాలిపోయే మోటార్లు - పేలిపోయే ట్రాన్స్‌ ఫార్మర్లు రైతుల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయ‌న్నారు. కేసీఆర్ పాల‌న‌లో ఆ బాధ‌ల‌న్నీ తీరిపోయాయ‌ని సూచించారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్తు అందుతున్న సంగ‌తిని గుర్తుచేశారు. కొండ పోచమ్మ ప్రాజెక్ట్‌ ద్వారా కాళేశ్వరంకు నీటిని త‌ర‌లించి.. అక్కడి నుంచి షామీర్‌ పేట్‌ రిజర్వాయర్‌ నింపి లక్షా 57 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హ‌రీశ్‌ హామీ ఇచ్చారు.

చంద్ర‌బాబుపై కూడా హ‌రీశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్రబాబుకు ధ‌మ్ముంటే యాదగిరిగుట్టకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబు ఫొటో ఉంటే ఓట్లు రావని ఎద్దేవా చేశారు. ప్ర‌జా కూట‌మి పత్రిక ప్రకటనల్లో ఆయన చిత్రాన్ని తొలగించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ను అడ్డుకున్న ఆంధ్రాబాబు తెలంగాణకు మేలు చేస్తాడని కోదండరామ్‌ అనడం విడ్డూరంగా ఉంద‌ని హ‌రీశ్‌ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News