బాబుకు 12 ప్ర‌శ్న‌లు సంధించిన హ‌రీశ్!!

Update: 2018-10-10 06:51 GMT
తూర్పు ప‌డ‌మ‌లు లాంటి కాంగ్రెస్‌.. తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకునే ప‌నిలో బిజీగా ఉండ‌టం తెలిసిందే. తెలంగాణ అధికార‌ప‌క్షాన్ని ఓడించ‌ట‌మే ల‌క్ష్యంగా మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో కాంగ్రెస్‌.. టీడీపీలు రెండూ క‌లిసి పోటీ చేస్తున్న విష‌యంపై టీఆర్ ఎస్ పార్టీ తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ పొత్తుపై ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ బాధ్య‌త‌ను హ‌రీశ్ రావు తీసుకున్నారు.

కాంగ్రెస్‌.. టీడీపీ పొత్తుపై ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసిన తాజా మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఏపీ ముఖ్య‌మంత్రి క‌మ్ టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబును ఉద్దేశించి 12 ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. ఎప్ప‌టిలానే లాజిక్ ఏ మాత్రం మిస్ కాన‌ట్లుగా ఉన్న త‌న‌ 12 ప్ర‌శ్న‌ల‌తో కాంగ్రెస్‌.. టీడీపీ పొత్తు ఎంత దుర్మార్గ‌మ‌న్న విష‌యాన్ని అంద‌రికి తెలిసే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పాలి.

ఇంత‌కీ బాబును టార్గెట్ చేస్తూ హ‌రీశ్ రావు సంధించిన 12 ప్ర‌శ్న‌లు ఏమిటి?  అన్న‌ది చూస్తే..

1. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు చివరిదాకా ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఆ వైఖరిని మార్చుకున్నారా? భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడకుండా ఉంటారా? దీనిపై టీడీపీ పొలిట్‌ బ్యూరోలో తీర్మానం చేశారా?
 
2. ఉద్యోగులు - ప్రభుత్వ సంస్థలు - హైకోర్టు విభజన - కరెంటు - పోలవరం వంటి వివాదాల్లో చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వాదనలు చేస్తున్నారు. ఇకపై తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తానని ఆయన నుంచి కాంగ్రెస్‌ ఏమైనా హామీ తీసుకుందా? ఒప్పందం ఏమైనా చేసుకుందా? తెలంగాణలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వేసిన కేసులను ఆయన ఉపసంహరించుకుంటారా?
 
3. కేంద్రాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేసి పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను చంద్రబాబు లాక్కున్నారు. వాటిని తిరిగి ఇచ్చేయడానికి సిద్ధమా? ఇందుకు చంద్రబాబును ఒప్పించేలా కాంగ్రెస్‌ ఆయనతో అంగీకారం ఏమైనా కుదుర్చుకుందా?
 
4. పోలవరాన్ని 150 మీటర్ల ఎత్తులో కట్టి - 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో డ్యామ్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలం రామాలయంతోపాటు తెలంగాణలోని లక్షల ఎకరాలు మునిగిపోతాయి. పోలవరం డిజైన్‌ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా?
 
5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతించవద్దని కేంద్రానికి వివిధ సంస్థలకుచంద్రబాబు 30 లేఖలు రాశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? అది చెప్పకుండా పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా?
 
6. కాళేశ్వరం - తుమ్మిడిహట్టి - సీతారామ - తుపాకులగూడెం - దేవాదుల - పెన్‌ గంగ - రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవడానికి చంద్రబాబు ఒప్పుకొన్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పగలరా?
 
7. పోలవరంతో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌ కు తరలిస్తున్నందున.. నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణానదిలో 80 టీఎంసీల వాటా ఇవ్వాలని గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు వస్తాయి. కానీ నీళ్లు ఇవ్వబోమని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చంద్రబాబు కొర్రీలు పెట్టారు. నల్లగొండ - మహబూబ్‌ నగర్‌ ప్రజల కోసం 45 టీఎంసీల నీటిని కాంగ్రెస్‌ సాధించగలదా?
 
8. హైదరాబాద్‌ తోపాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు మిషన్‌ భగీరథను చేపడితే.. గోదావరి - కృష్ణా నదీ జలాలను వాడుకోవడం తప్పు అని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఇది తప్పు అని ఆయన ఏమైనా పశ్చాత్తాపం వ్యక్తం చేశారా?
 
9. రూ.5 వేల కోట్ల విలువైన సీలేరు పవర్‌ ప్రాజెక్టును చంద్రబాబు లాక్కున్నారు. తెలంగాణకు ఏపీ ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టును తిరిగి ఇచ్చేస్తామని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా? నష్టపరిహారమైనా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందా?
 
10. ఏపీకి చెందిన 1200 మంది విద్యుత్తు శాఖ ఉద్యోగులను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తే.. వారిని విధుల్లో చేర్చుకోకుండా ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. పని చేయకున్నా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. వారిని విధుల్లో చేర్చుకుని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కేసులను ఉపసంహరించుకునేలా చేస్తారా?
 
11.. నిజాం కాలం నుంచి ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ వాదిస్తోంది. కోర్టుల్లో కేసులు వేసింది. వాటిలో ఏపీకి వాటా ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? కేసుల ఉపసంహరణకు ఒప్పుకున్నారా?
 
12.. ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో ఏపీ సహాయ నిరాకరణ చేస్తోంది. ఈ వివాదాల పరిష్కారానికి సహకరిస్తానని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?
Tags:    

Similar News