కేసీఆర్ కు షాక్ ఇస్తున్న హ‌రీష్ రావు

Update: 2018-06-05 08:13 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం అంటే కేసీఆర్ - కేటీఆర్ - క‌విత‌ - హ‌రీష్ రావు అని త‌ర‌చూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తుంటాయి. దానికి తోడు న‌మ‌స్తె తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో కేటీఆర్ కు ఇచ్చిన ప్రాధాన్యం హ‌రీష్ రావుకు ఇవ్వ‌క‌పోవ‌డం ఈ అనుమానాల‌కు అనుమానాల‌కు బ‌లం చేకూరుస్తుంది. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ రోజు క్షేత్ర‌స్థాయిలో ముఖ్యంగా వ్య‌వ‌సాయరంగంలో మంచిపేరు రావ‌డానికి కార‌ణం గ‌త నాలుగేళ్లుగా హ‌రీష్ రావు నిర్విరామంగా ప్రాజెక్టుల పూర్తికి శ్రమిస్తుండ‌డ‌మే అని ప్ర‌తిఒక్క‌రికీ తెలుసు. మాస్ లీడ‌ర్ గా హ‌రీష్ రావు ఎక్క‌డిక‌యినా చొచ్చుకువెళ్తారు. కేటీఆర్ ఎంత ప్ర‌య‌త్నించినా క్లాస్ లీడ‌ర్ గానే మిగిలిపోతున్నారు త‌ప్పితే మాస్ ని హ‌రీష్ రావులా ఆక‌ర్షించ‌లేక‌పోతున్నారు.

ఇక గ‌త నాలుగేళ్ల‌లో ఉద్యోగాలు ఎక్కువ వేయ‌లేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి ఉద్యోగుల బ‌దిలీలు చేప‌ట్ట‌క‌పోవ‌డం కూడా చెడ్డ పేరు తెచ్చింది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగుల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేసీఆర్ ఆర్టీసి విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3500 కోట్లు ఇచ్చినా మ‌ళ్లీ ఆర్టీసీ జీతాల పెంపుకు నా వ‌ద్ద‌కు రావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. జీతాల పెంపు గురించి ఏమో గానీ కేసీఆర్ అన్న ఈ మాట‌లు ఆర్టీసీ కార్మికుల‌కు పుండు మీద కారంలా మారాయి. ఆర్టీసీలో గుర్తింపు పొందిన అధికార సంఘం కూడా టీఆర్ ఎస్ అనుబంధ తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌నే (టీఎంయూ). కేసీఆర్ మాట‌లు ఇప్పుడు ఆ అధికార యూనియ‌న్ మ‌నుగ‌డ‌కు ప్ర‌శ్నార్ధకంగా మారాయి. దానికితోడు ఆ సంఘానికి గౌర‌వ అధ్య‌క్షుడు హ‌రీష్ రావు కావ‌డం మూలంగానే కేసీఆర్ వ్య‌తిరేకించార‌ని హ‌రీష్ అనుకూల వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి.

ఉద్యోగుల‌తో స‌మావేశం సంధ‌ర్భంగా ఆర్టీసీ ప్ర‌తిపాద‌న‌ల‌ను తోసిపుచ్చిన కేసీఆర్ స‌మ్మె నోటీసు ఇచ్చిన వారు ఉప‌సంహ‌రించుకున్నారా ?  లేదా ? అని మీడియా ముందే హెచ్చరించే దోర‌ణిలో మాట్లాడారు. గ‌త కొన్ని రోజులుగా కేసీఆర్ నుండి ఏమ‌యినా సానుకూల సంకేతాలు వ‌స్తాయ‌ని ఎదురు చూసిన ఆర్టీసీ సంఘాలు ఇప్పుడు మ‌ళ్లీ స‌మ్మె కు దిగుతున్నామ‌ని ప్ర‌క‌టించాయి. ప్ర‌ధానంగా ఇందులో ముందున్న‌ది హ‌రీష్ రావు గౌర‌వ అధ్య‌క్షునిగా ఉన్న తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల వేత‌న స‌వ‌ర‌ణ‌కు ఒప్పుకోకుంటే ఈనెల 11 నుంచి తాము నిరవధిక సమ్మెకు దిగుతున్నామని, ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తామని, 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని సంఘం అధ్య‌క్షుడు అశ్వ‌థ్థామ రెడ్డి ప్ర‌క‌టించారు.  అస‌లే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఆర్టీసీ కార్మికుల‌తో ఈ గొడ‌వ ఎందుక‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. కేసీఆర్ ఎవ‌రు చెప్పినా విన‌ర‌ని అందుకే ఓ సారి స‌మ్మెకు వెళ్తే ఏద‌యినా పున‌రాలోచ‌న చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి హ‌రీష్ రావు గ‌ట్టి షాకే ఇస్తున్న‌ట్లు అనిపిస్తుంది.
Tags:    

Similar News