నదీజలాలు-ఆస్తులు..బాబు ఎటువైపు:హరీష్

Update: 2018-10-07 10:57 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బుల కోసమే మహాకూటమి ఏర్పడిందని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణను దోచుకోవడానికే మహాకూటమి పుట్టిందని ధ్వజమెత్తారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మందపల్లి లో నిర్వహించిన ఏకగ్రీవ తీర్మాన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని కులసంఘాల నాయకులు హరీష్ కే ఓటు వేస్తామని తీర్మానం చేసి.. తీర్మాన పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సభలో మాట్లాడుతూ హరీష్ మహాకూటమిపై నిప్పులు చెరిగారు.

తెలంగాణను పడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ జతకడుతోందని.. ఇక ఏమనాలని విమర్శించారు. ప్రజలు మహాకూటమికి ఓట్లతో బుద్ది చెప్పాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.

నదీజలాలు - ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ - ఏపీ ఎవరి పక్షాన నిలబడతారో చెప్పాలని హరీష్ సవాల్ చేశారు. తెలంగాణను దోచుకోవడానికే మహాకూటమి పుట్టిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు చంద్రబాబు కుతంత్రాలకు పాల్పడుతున్నాడని హరీష్ రావు ఆరోపించారు.  అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఆగిపోతుందని అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్ ది ఓర్వలేనితనమన్నారు.

రాబోయే 60 రోజులు అందరూ పట్టుదలతో పనిచేయాలని హరీష్ రావు టీఆర్ ఎస్ నేతలకు సూచించారు. గెలిస్తే రాబోయే ఐదేళ్లు మీకోసం పనిచేస్తానని హరీష్ హామీ ఇచ్చారు. మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. వలసలు - ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ కావడమే టీఆర్ఎస్ ఎజెండా అని హరీష్ రావు అన్నారు.
Tags:    

Similar News