కేసీఆర్ ఫెడ‌ర‌ల్‌ ఫ్రంట్ ఫ‌లించ‌ట్లేదా?

Update: 2018-12-25 10:13 GMT
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న‌ది గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభిలాష‌. అందుకే సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఫ్రంట్ ఏర్పాటు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ప‌లు ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యేందుకు తాజాగా ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఇప్ప‌టికే ఒడిశా సీఎం - బీజేడీ అధినేత న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వంటి నేత‌లతో భేటీ అయ్యారు.

అయితే - ప్రాంతీయ పార్టీల‌యిన బీజేడీ, తృణ‌మూల్ ల నుంచి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కుతున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, మ‌మ‌త‌ల‌తో కేసీఆర్ భేటీ అయిన‌ప్ప‌టికీ వారు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. కేసీఆర్ తో సంయుక్తంగా విలేక‌ర్ల స‌మావేశంలో న‌వీన్‌, మ‌మ‌త పాల్గొన్నారు. ఆ స‌మావేశాల్లో కేసీఆర్ మాట్లాడారే త‌ప్ప ఇద్ద‌రు నేత‌లు పెద‌వి విప్ప‌లేదు. గులాబీ ద‌ళ‌ప‌తి వ్య‌వ‌హార తీరు పై ఉన్న అనుమానాలు - ఆందోళ‌న‌ల కార‌ణంగానే మ‌మ‌త‌, న‌వీన్ నోరు విప్ప‌లేద‌ని తెలుస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు వారు మ‌ద్ద‌తు ప్ర‌కటించ‌క‌పోవ‌డానికీ అదే కార‌ణ‌మ‌ని స‌మాచారం.

విశ్వ‌సనీయ స‌మాచారం ప్ర‌కారం.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు ప్ర‌య‌త్నాల‌పై న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, మ‌మ‌త ఇప్ప‌టికే త‌మ‌ మంత్రులు, స‌న్నిహితుల వ‌ద్ద చ‌ర్చించారు. తాను అనుకున్న‌ది ద‌క్కిన త‌ర్వాత ఎవ‌రినైనా స‌రే న‌ట్టేట ముంచే నైజం కేసీఆర్ ది అని స‌న్నిహితుల వ‌ద్ద ఆ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు పేర్కొన్నార‌ట‌. ఆయ‌న్ను పూర్తిగా విశ్వ‌సించ‌డం మంచిది కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్క‌డం కేసీఆర్ కు అల‌వాటేన‌ని చెప్పార‌ట‌. తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించిన సోనియా గాంధీపై ఏమాత్రం అభిమానం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తుడిచిపెట్టిన తీరును ఇరువురు ముఖ్య‌మంత్రులు త‌మ స‌న్నిహితులు, పార్టీ పెద్ద‌ల వ‌ద్ద ప్ర‌స్తావించార‌ట‌.

ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం కేసీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో దిల్లీలో భేటీ అవ‌నుండ‌టంపై కూడా న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, మ‌మ‌తా బెన‌ర్జీ మ‌న‌సుల్లో చాలా అనుమానాలున్నాయ‌ట‌. మోదీ-కేసీఆర్ ల మ‌ధ్య స్నేహం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంద‌ని వారు అనుకుంటున్నార‌ట‌. ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో త‌న చ‌ర్చ‌ల వివ‌రాల‌ను తెలియ‌జేసేందుకే మోదీతో కేసీఆర్ స‌మావేశం అవుతుండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశార‌ట‌. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీయే వ్య‌తిరేక ఓట్ల‌ను ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో చీల్చి మోదీని మ‌ళ్లీ ప్ర‌ధాని పీఠ‌మెక్కించాల‌న్న‌దే బ‌హుశా కేసీఆర్ వ్యూహం కావొచ్చ‌ని కూడా అనుమానాలు వ్య‌క్తం చేశార‌ట‌. అందుకే కేసీఆర్ కు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై వెన‌క్కి త‌గ్గార‌ట!


Tags:    

Similar News