దేశవ్యాప్త రైతుబంధు సాధ్యం కాకపోవచ్చు

Update: 2019-02-03 10:12 GMT
సార్వత్రిక ఎన్నికల్లో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన రైతు బంధు తరహా పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పథకం అమలుకు చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు అనేక ఉన్నాయని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ఎన్ కే పొద్దార్ చెబుతున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పీయూష్ గోయాల్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తామని, తొలి విడుతగా 2వేలు ఈ ఏడాదే ఇస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా రైతులు లబ్ధిపొందుతారని తెలిపారు. కాగా దీని అమలుకు రూ.75వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా దీని అమలు మాత్రం అంత సులువుకాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఎన్కే పొద్దార్ ఈ పథకం అమలుపై తన అభిప్రాయం తెలియజేశారు. రైతులకు రూ.6వేలు సరిపోతాయా లేదా అన్నది పక్కన పెడితే  దీని అమలు మాత్రం చాలా కష్టంతో కూడుకున్నదని, దీనికి న్యాయపరమైన చిక్కులు అనేక వస్తాయని తెలిపారు. భూ యాజమాన్య హక్కులై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ పథకం అమలుకు అడ్డంకిగా మారవచ్చన్నారు.

టైటిల్ డీడ్ లో ఒకరి పేరున్నంత మాత్రనా ఆ భూమిపై యాజమాన్య హక్కులు అతనికే దక్కవని, న్యాయపోరాటంలో ఇతరులు కూడా యాజమాన్య హక్కుల కోసం పోరాడవచ్చని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీనివల్ల ఒక భూమికి ఒకరికంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే వారందరూ రూ.6వేల సాయం అందుకుంటారని పొద్దార్ చెప్పారు. దీనివల్ల మొదటి విడుత రూ.2వేల సాయం ఇవ్వడం కూడా సవాలేనని ఆయన విశ్లేషించారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.75వేల కోట్లు పంచితే వృథాగా అయినట్లేనని జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎకనమిక్స్ ఫ్రొఫెసర్ సైకత్ సిన్హా రాయ్ మరో వాదన వినిపిస్తున్నారు. ఈ మొత్తాన్ని రైతులకు పెట్టుబడి సాయంగా లేదా మంచి ధరలు కల్పించడానికి ఉపయోగిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏదిఏమైనా ఎన్నికల ముందు రైతులపై మోడీ ప్రయోగించిన బ్రహ్మస్త్రం ఫలిస్తుందా? లేక విఫలవుతుందో కొద్దిరోజుల్లో తేలిపోతుంది. అంతవరకు వేచి చూడాల్సిందే మరీ..

Tags:    

Similar News