హిజాబ్ వివాదానికి పరిష్కారం దొరికినట్లేనా ?

Update: 2022-02-15 05:46 GMT
దేశాన్ని పట్టి కుదిపేస్తున్న హిజాబ్ వివాదానికి పరిష్కారం లభించినట్లేనా ? ఆరుగురు విద్యార్ధినులు తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ లో పరిష్కారం చూపినట్లున్నారు. ఇంతకీ ఆ పరిష్కారం ఏమిటంటే కాలేజీ యూనిఫారమ్ రంగులోనే హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యార్ధినులు హైకోర్టును కోరారు. కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో హిజాబ్ వివాదం మొదలైన విషయం అందరికీ తెలిసిందే.

యూనిఫారంను ధరించి మాత్రమే కాలేజీకి రావాలనే నిబంధన ఎప్పటి నుండో అమల్లో ఉంది. అయితే దానికి భిన్నంగా ఆరుగురు ముస్లిం విద్యార్ధినులు యూనిఫారమ్ తో పాటు హిజాబ్ కూడా ధరించి వచ్చారు. దాంతో మిగిలిన విద్యార్ధులతో వివాదం మొదలైంది.

ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించినపుడు తాము జై శ్రీరామ్ అని రాసున్న కండువాలు, తలపాగాలు ఎందుకు ధరించకూడదు అని యాజమాన్యాన్ని నిలదీశారు. అలాగే కాషాయ రంగులోని కండువాలను, తలపాగాలను ధరించి కాలేజికి హాజరయ్యారు.

ఇలా రెండు వర్గాల మధ్య ఉడిపిలో మొదలైన వివాదం చివరకు రాష్ట్రమంతా పాకింది. చివరకు కర్నాటకకు మాత్రమే కాకుండా దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు వివాదం పాకిపోయింది. దాంతో ఎక్కడికక్కడ న్యాయస్ధానాలు జోక్యం చేసుకోవాల్సొచ్చింది.

విద్యార్ధులను మధ్య వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. దాంతో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు మొదలైపోయాయి. దాంతో ఎక్కడికక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సొచ్చింది.

ఈ నేపధ్యంలోనే బెంగుళూరు హైకోర్టులో ఆరుగురు విద్యార్ధినులు తాజాగా ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. తమ యూనిఫారమ్ రంగులోనే ఉండే హిజాబ్ ను ధరించేందుకు అనుమతివ్వాలంటు కోరారు. కేంద్రీయ విద్యాసంస్థల్లో యూనిఫారమ్ రంగులోనే ఉండే హిజాబ్ లు ధరించేందుకు అనుమతి ఉందని విద్యార్ధినుల తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. కోర్టులో విచారణ ఎలాగున్నా ఎనిమిది రాష్ట్రాల్లో హిజాబ్ వివాదం చాలా వేగంగా పెరిగిపోతోంది. మరి చివరకు బెంగులూరు కోర్టు ఏమంటుందో చూడాలి.
Tags:    

Similar News