బాబు, రావెల ఆటలో అరటిపండయిన కారెం

Update: 2016-11-05 14:35 GMT
ఎస్సీ -ఎస్టీ ఛైర్మన్‌ కారెం శివాజీ నియామకం విషయంలో రేగుతున్న వివాదం వెనుక రాజకీయ ఆధిపత్యం ఉందా....? రాజకీయ ఆధిపత్యం కోసమే శివాజీని బలిచేశారా... ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు - సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌ బాబులే దీనికి బాధ్యులని ఆరోపిస్తున్నారు దళిత నేతలు. ఎస్సీలను ఉపకులాల పేరిట వర్గీకరించే అంశాన్ని చంద్రబాబే పెంచిపోషించారని...  సమస్యలను చట్టప్రకారం పరిష్కరించకుండా రాజకీయ ఫలాల కోసం వాడుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఎస్సీలు ఒకప్పుడు కాంగ్రెస్ కు గంపగుత్తగా ఓట్లేసేవారు. అలాంటి ఓటు బ్యాంకు చీల్చేందుకు చంద్రబాబు మాల - మాదిగల మధ్య చిచ్చు పెట్టారని గత పరిణామాలను గుర్తు చేస్తున్నారు. ఆ మంటలు ఇంకా చల్లారలేదని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం - వై.సి.పి. ఆవిర్భావంతో చంద్రబాబు తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని మాదిగలను దరిచేర్చుకొని - మాలలను పక్కన బెట్టే వ్యూహానికి తెరతీశారని చెబుతున్నారు. అయితే... అంతలోనే వారి అవసరాన్ని గుర్తించి మళ్లీ వారిని చేరదీసే ప్రయత్నంలో వైసీపీలో ఉన్న జూపూడి ప్రభాకర్‌ ను తనవైపు తిప్పుకున్నారు. దాంతో టీడీపీలో ఎస్సీ నేతగా చక్రం తిప్పుతున్న మంత్రి రావెల కిషోర్‌ బాబు.. తనకు చెక్‌పెట్టడానికే చంద్రబాబు జూపూడిని తీసుకొచ్చారని భావించి ఆయన కొత్త ప్లాను వేశారు. మాలమహానాడు అధ్యక్షుడుగా ఉన్న కారెం శివాజీని రంగంలోకి దించి సీఎంను ఒప్పించి కారెంకు పదవి ఇప్పించారు.  అర్హతలు - నియమనింబంధనలు చూసుకోకుండా కారెం ను ఎస్సీ - ఎస్టీ ఛైర్మన్‌ గా చేయడంతో విషయం కోర్టు వరకూ వెళ్లింది. కారెం నియామకాన్ని కోర్టు రద్దు చేసింది.

దీంతో చంద్రబాబు మరోసారి మాలలను దెబ్బతీసినట్లయింది. చంద్రబాబు - రావెల ఆడిన ఆటలో కారెం అభాసుపాలయ్యారు. మాలల్లో ఆయన నాయకత్వం విషయంలోనే ఇబ్బంది వచ్చింది. సామాజికవర్గానికి ప్రతినిధిగానూ ఉండక.. ప్రభుత్వ పదవిలోనూ లేక ఆయన రోడ్డుపడినట్లయింది. ఇప్పుడిక చంద్రబాబు ఇంకే నేతను తన రాజకీయాలకు పావుగా వాడుకుంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News