అటూ ఇటూ కాకుండా పోయిన ఎమ్మెల్యే?

Update: 2020-10-18 01:30 GMT
ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీనే కాదు.. జనసేన ఉనికి కూడా ఉంది. ఈ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గెలిచారు. ఈయన ఏపీ అసెంబ్లీలో ఒకే ఒక్కడుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. జనసేన కండువాను ధరించి టీడీపీ, వైసీపీ మధ్యలో ప్రత్యేకంగా కనిపించారు.

గెలిచిన జనసేన పార్టీని కాదని అసెంబ్లీలో.. ఇంటా బయటా వైసీపీకి దగ్గరైన రాపాకకు ఎన్నో విషయాల్లో మద్దతు ప్రకటించారు. రాజోలులో తనే వైసీపీ నేతగా చెలామణి అయ్యారు. ఇప్పుడు అధికార వైసీపీ పార్టీలో ఆదరణ కరువైందట..

అయితే కొద్ది రోజులుగా రాజోలు నియోజకవర్గంలో రాపాక పరిస్థితి తలకిందులైందన్న చర్చ సాగుతోంది. నియోజకవర్గంలోని పనుల కోసం ఎమ్మెల్యే అధికారుల దగ్గరకు వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదట.. ఒకప్పుడు అధికారులతో బాగా పనులు చేయించుకున్న రాపాకకు ఇప్పుడు ఏ పని కావడం లేదట.. రాపాక పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోయింది? అని ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూసింది.

రాజోలు నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారట.. అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావులు అసమ్మతి వల్ల జనసేన అభ్యర్థిగా రాపాక గెలిచాడు. అమ్మాజీ వర్గం మొత్తం రాపాకకు మద్దతు తెలిపింది. బొంతు వర్గం రాపాకను వ్యతిరేకించింది.

తాజాగా అమ్మాజీ వర్గంతో రాపాకకు చెడిందట.. దాంతో అమ్మాజీ వర్గం కూడా ఎమ్మెల్యేను దూరం పెట్టినట్టు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. దీంతో బొంతు వర్గం కూడా రాపాకను టార్గెట్ చేయడం మొదలుపెట్టిందట.. అందుకే అధికారులు ఎవరూ ఇప్పుడు రాపాకకు పనులు చేయడం లేదని టాక్. వైసీపీ అధిష్టానం మద్దతుతో బొంతు వర్గం నియోజకవర్గంలో చక్రం తిప్పుతోందట..

ఇప్పుడు నమ్ముకున్న వైసీపీలో బలమైన వర్గంతో రాపాకకు చెడడం.. జనసేన నాయకులను కావాలనే రాపాక దూరం పెట్టడంతో రెంటికి చెడ్డ రేవడిలా రాపాక పరిస్థితి తయారైందన్న టాక్ ఆ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇటు ప్రభుత్వంలో పనులు కాక.. ఇటు పార్టీలోనూ పరపతి లేక రాపాక డమ్మీ అయిపోయాడని నియోజకవర్గంలో కోడై కూస్తున్నారు.
Tags:    

Similar News