తెలుగు రాష్ట్రాల్లో కూల్ సమ్మర్.. ఎంత హాటో తెలిస్తే చెమటలే!

Update: 2020-05-22 04:45 GMT
వేసవి వస్తుందంటే చాలు.. తెలుగు ప్రజలకు చెమటలు పట్టేసే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత వేరుగా ఉంటుంది. ఎండాకాలంలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత కోస్తాలో కామన్ అయితే.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అప్పుడప్పడు మాత్రమే ఉంటుంది. గుంటూరు.. క్రిష్ణా..ప్రకాశం జిల్లాల్లో 42 డిగ్రీల ఎండ తీవ్రతకు.. హైదరాబాద్ లో ఇదే టెంపరేచర్ కు ప్రజలు పడే ఇబ్బందుల్లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఈసారి వేసవి సీజన్ పెద్దగా తెలీకుండా జరిగిపోయింది.

దీనికి తోడు.. ఈసారి వేసవి కాస్త కూల్ గా సాగిందనే చెప్పాలి. మేలో కనిపించే గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈసారి కనిపించలేదన్న కొరత రోజులో తీరిపోయింది. ఈసారికి కూల్ సమ్మరే అనుకున్న భావనను ఆంఫన్ తుఫాను బలహీనపడి మొత్తంగా మార్చేసింది. మొన్నటివరకూ ఫర్లేదనుకున్న ఎండలు.. గురువారం ఒక్కరోజులో అనూహ్యంగా మారిపోయాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఎండలు నమోదయ్యాయి. సాధారణం కంటే మూడు నుంచి ఆరేడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఎండలు మండాయి. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో చూడని 42 డిగ్రీల ఉష్ణోగ్రత గురువారం నమోదైంది. అదే సమయంలో ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని ఐఎస్ రాఘవపురంలో 48 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రకాశం జిల్లా కురించేడులోనూ 48 డిగ్రీలు నమోదైంది. క్రిష్ణా జిల్లా పమిడిముక్కల.. గుంటూరుజిల్లా క్రోసూరు.. శ్రీకాకుళం జిల్లా జగ్గిలబొతు ప్రాంతాల్లో 46.3 డిగ్రీల ఎండ నమోదైంది. ఏపీలోని చాలా చోట్ల 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణ విషయానికి వస్తే.. ఏపీతో పోలిస్తే తక్కువే అయినా.. కొట్టిపారేసంత తక్కువేం కాదు సుమా. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మంలో 45.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే అత్యధికమని చెబుతున్నారు. నల్గొండ.. రామగుండంలో 44 డిగ్రీలు.. నిజామాబాద్.. భద్రాచలం.. మహబూబ్ నగర్.. హన్మకొండలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలునమోదయ్యాయి.  తాజా ఎండలకు ఇటీవల ఏపీ తీరం దాటి పశ్చిమబెంగాల్ కు చుక్కలు చూపిస్తున్న అంఫన్ తుపాను ప్రభావంగా చెబుతున్నారు. రానున్న నాలుగైదు రోజుల్లోనూ ఎండ తీవ్రత తప్పదని స్పష్టం చేస్తున్నారు. దీంతో.. కూల్ సమ్మర్ గా భావించిన తెలుగు ప్రజలకు అంఫన్ ఊహించని ట్విస్టును ఇచ్చిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News