హిజాబ్ వివాదం ఎన్నిక‌ల వ‌ర‌కూ?

Update: 2022-02-24 00:30 GMT
సున్నితం అయిన అంశాల జోలికి వెళ్ల‌కుండా ఉండ‌డం అన్న‌ది రాజ‌కీయ నాయ‌కుల‌కే కాదు సంబంధిత సంస్థ‌ల‌కూ చేత‌గాని ప‌ని.అందుకే ఎన్న‌డూ లేని వివాదాల‌ను రేపి కొత్త వివాదాల‌ను సృష్టించి ఎన్నిక‌ల్లో ప‌బ్బం గడుపుకోవాల‌న్న యోచ‌న చేస్తున్నాయి. ఇప్పుడు విద్యా సంస్థ‌ల్లో మత ప్ర‌భావం సంబంధిత ఆచారం అన్న‌వి పెద్ద వివాదాల‌కు లేనిపోని గొడ‌వ‌ల‌కు కార‌ణం అవుతున్నాయి.

హిందూ ముస్లిం గొడ‌వ‌ల‌కు కారణం అయ్యేలా రెండు వ‌ర్గాలూ కొట్టుకునేందుకు కార‌ణం అయ్యేలా  కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌భావితం చేస్తున్నాయి.హిజాబ్ వివాదం కార‌ణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల్లో యూనిఫాం కోడ్ ఏ విధంగా అమ‌లు అవుతోంది అన్న‌దే పెద్ద చ‌ర్చ‌కు తావిస్తోంది.

ఉత్త‌రప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓ వర్గం ఈ ర‌గ‌డ రాజేసిందా అన్న అనుమానాలూ ఉన్నాయి. బీజేపీ ప్ర‌భావిత ప్రాంతాలే కాదు ప్ర‌శాంత‌త‌కు ఆన‌వాలుగా నిలిచే ఇత‌ర ప్రాంతాలు కూడా ఈ స‌మ‌స్య కార‌ణంగా త‌మ ప్ర‌శాంత సంబంధ ఉనికిని కోల్పోతున్నాయి.

ఈ నేప‌థ్యంలో దేశంలో అన్ని వ‌ర్గాల‌నూ,దేశ వ్యాప్తంగా ఉన్న అంద‌రి మ‌నోభావాల‌నూ ప్ర‌భావితం చేస్తూ వ‌స్తున్న ఏకైక వివాదం హిజాబ్ ప‌రిణ‌మిస్తోంది. చిన్నవారి దగ్గ‌ర నుంచి పెద్ద‌వారి దగ్గ‌ర వ‌ర‌కూ ఈ వివాదంపై చ‌ర్చ న‌డుస్తోంది. ఇది మ‌త సంబంధ సున్నిత వ్య‌వ‌హారం కావ‌డంతో ఎవ‌రికి వారు ఇష్టారాజ్యం దీన్నొక వివాద కేంద్రంగా మారుస్తుండ‌డ‌మే బాధాక‌రం.

క‌ర్ణాట‌క‌లో ప్రారంభం అయిన వివాదం ఇప్పుడు ఆంధ్రాలోనూ హ‌ల్చ‌ల్ చేస్తోంది. మొన్న‌టి వేళ విజ‌య‌వాడ ల‌యోలా కాలేజీలో హిజాబ్ తీసి విద్యాల‌యానికి రావాల‌ని ప్రిన్సిప‌ల్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో పెద్ద దుమార‌మే రేగింది.దీంతో ఇప్పుడీ వివాదం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌నూ ప్ర‌భావితం చేయ‌నుంది.ఆ ఎన్నిక‌లు అయ్యేంత వ‌ర‌కూ వివాదం న‌డుస్తుంది.అవి అయిపోగానే వివాదం అంతా స‌మ‌సిపోతుంది.

నిన్న‌టి వేళ ప్ర‌కాశం జిల్లా, ఎర్ర‌గొండ పాలెం, వికాస్ విద్యాసంస్థ‌లో  హిజాబ్ వివాదం రేగింది.విద్యార్థినులు హిజాబ్ తీసి రావాల‌ని పాఠ‌శాల యాజమాన్యం ప‌ట్టుబ‌ట్టింది.దీంతో అక్క‌డికి ముస్లిం సంఘాలు చేరుకుని ఆందోళ‌న‌లు చేశాయి.అదేవిధంగా మొన్న‌టి వేళ విజ‌య‌వాడ‌లోనూ ల‌యోలా కాలేజీ ప్రిన్సిప‌ల్ ఇదే విధంగా ప్ర‌వర్తించి వివాదానికి కార‌ణం అయ్యారు.

ఆఖ‌రికి ప్ర‌జా సంఘాలు,ముస్లిం సంఘాల‌తో పాటు టీడీపీ కూడా ఆందోళ‌న చేయ‌డంతో స‌మ‌స్య  ప‌రిష్కారం అయింది. క‌లెక్ట‌ర్ కూడా జోక్యంచేసుకోవ‌డంతో వివాదం వెనువెంట‌నే ముగిసిపోయింది.ఇప్పుడు తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రేగిన త‌గాదాలు అన్నీ కూడా కొన్ని శ‌క్తుల ప్రేర‌ణ‌తోనే సాగుతున్నాయి క‌నుక ఇవ‌న్నీఎన్నిక‌ల త‌రువాత ఉండ‌వు గాక ఉండవు.అంత‌వ‌ర‌కూ ఇరు వ‌ర్గాలూ సంయమ‌నం పాటిస్తే మేలు.
Tags:    

Similar News