సింధుకి భారీ షాక్ ... సెమీస్ లోనే ఇంటిబాట !

Update: 2021-11-20 16:31 GMT
ఇండియా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పివి సింధూకు మరో సారి షాక్ తగిలింది. ఇటీవల డెన్మార్క్ ఓపెన్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆమెకు మరో పరాజయం ఎదురైంది. బాలి వేదికగా జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటు మహిళల సింగిల్స్ లో మూడో సీడ్ సింధు.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో ఓడింది. ఈ గెలుపుతో యమగూచి,ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో సింధు చేతిలో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది.

39 నిమిషాల్లోనే ముగిసిన నేటి పోరులో యమగూచి సింహంలా గర్జించింది. దీంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సింధు చేతులెత్తేసింది. శనివారం జరిగిన సెమీస్ పోరులో సింధు.. 13-21, 9-21 తేడాతో యమగూచి చేతిలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఆట ఆరంభం నుంచి సింధుపై ఆధిపత్యం చెలాయించిన యమగూచి.. చివరిదాకా దానిని కొనసాగించింది. క్వార్టర్స్ లో సింధు.. నెస్లిహన్ యిగిత్ (టర్కీ) ని అలవోకగా ఓడించినా సెమీస్ లో మాత్రం తేలిపోయింది.

ఇప్పటివరకు సింధు.. యమగూచి 19 సార్లు తలపడ్డారు. అందులో సింధు 12 మ్యాచుల్లో నెగ్గగా.. జపాన్ క్రీడాకారిని ఏడు సార్లు మాత్రమే విజయం సాధించింది. రికార్డులు కూడా తనకే అనుకూలంగా ఉన్నా సింధు మాత్రం నేటి మ్యాచ్ లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నీలో కూడా సింధు ఒక్క అడుగు దూరంలో పతకాన్ని కోల్పోయింది. జపాన్‌కి చెందిన సయాక తకహాషీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మూడు సెట్ల పాటు పోరాడి ఓడింది.

ఇదిలాఉండగా పురుషుల సింగిల్స్ సెమీస్ లో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్.. నేటి సాయంత్రం మూడో సీడ్ అండర్స్ ఆంథోన్సెన్ (డెన్మార్క్) తో తలపడనున్నాడు. ఈ ఏడాది వీరిద్దరూ తలపడుతుండటం ఇది నాలుగోసారి. ఇందులో మూడు సార్లు అండర్సే నెగ్గగా.. ఒక్కసారి మాత్రమే శ్రీకాంత్ గెలిచాడు.
Tags:    

Similar News