రెడ్‌ అలెర్ట్‌; జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Update: 2015-05-23 10:08 GMT
దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లే. దేశవ్యాప్తంగా భానుడి భగభగలతో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో భారతవాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్‌ అలెర్ట్‌  ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గత ఆరు రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం.. ఎండదెబ్బకు  ప్రజలు పిట్టల మాదిరి రాలిపోతున్న దుస్థితి. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా 427 మంది మృత్యువాత పడ్డారు. అదే సమయంలో మరో మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో.. వీలైనంతవరకూ పగటివేళల్లో బయటకు రాకుండా ఉండటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. శనివారం ఉష్ణోగ్రతల్ని చూస్తే.. హైదరాబాద్‌లో 44డిగ్రీలుగా నమోదైంది. ఇది గడిచిన ఐదేళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇక.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

68 ఏళ్ల తర్వాత పగటి ఉష్ణోగ్రతగా 48 డిగ్రీలుగా నమోదైంది. దీంతో.. ఖమ్మం పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. జనాలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. అసాధారణంగా ఉన్న ఎండల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News