ఐఎండీ హెచ్చ‌రిక‌లు.. డేంజ‌ర్ జోన్‌లో ఉంది ఈ రాష్ట్రాలేనా?

Update: 2022-09-07 04:18 GMT
దేశంలో ప‌లు రాష్ట్రాల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) డేంజ‌ర్ బెల్స్ మోగించింది. అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రానున్న రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని బాంబుపేల్చింది. వ‌చ్చే మూడు రోజులు.. సెప్టెంబ‌ర్ 7, 8, 9 తేదీల్లో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు తాజాగా హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్ల‌డించారు. ముఖ్యంగా కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన‌ లక్షద్వీప్, తెలంగాణ, కోస్తా ఆంధ్ర, కేర‌ళ‌లలో సెప్టెంబ‌ర్  7, 8,9 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భార‌త వాతావ‌ర‌ణ శాఖ విభాగం తెలిపింది. కేరళ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ హెచ్చ‌రించింది.

ముఖ్యంగా కేర‌ళ రాజ‌ధాని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండ‌టంతో ఐఎండీ ఆయా జిల్లాల్లో ఇప్ప‌టికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్ప‌టికే ఆ ప్రాంతాల్లో పాఠ‌శాల‌ల‌కు సెలవు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే ఎర్నాకుళం, ఇడుక్కి, పాలక్కాడ్, మణప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాల్లోనూ భారీవర్షాలు కురిశాయి. తమిళనాడులోని నీలగిరి, మెట్టుపాలయం, ఉద‌క‌మండలం ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయని వార్త‌లు వ‌చ్చాయి. అదేవిధంగా కల్లార్ హిల్ గ్రోవ్ ప్రాంతాల్లో రైలు పట్టాలపై కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇక కర్ణాటక రాష్ట్రంలోనూ భారీవర్షాల వల్ల సిలీకాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో లోతట్టుప్రాంతాలు నీటమునిగిన సంగ‌తి తెలిసిందే. గ‌త 40 ఏళ్ల‌లో ఎప్పుడూ లేనంత వర్షం ప‌డింది. రెయిన్ బౌ డ్రైవ్ లేఅవుట్, సన్నీ బ్రూక్ లేఅవుట్, సార్జాపూర్ రోడ్డు, మ‌హాదేవ‌పురం ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి.

బెంగళూరు నగరం వరదలతో అతలాకుతలమైంది. ఐటీ సంస్థ‌ల‌కు ఒక్క రోజులోనే రూ.225 కోట్ల న‌ష్టం ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వరదల బారినపడిన బెంగళూరు నగరంలో సహాయ పునరావాస పనుల కోసం రూ.600 కోట్లను కేటాయించినట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News