డర్టీ బాంబ్‌ ఆందోళనలు.. రష్యాకు భారత విదేశాంగ మంత్రి!

Update: 2022-10-28 05:34 GMT
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆటం బాంబ్‌ (డర్టీ బాంబ్‌) ప్రయోగించడానికి రెండు దేశాలు సిద్ధమయ్యాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రష్యానే తమపైన డర్టీ బాంబ్‌ ప్రయోగించడానికి సిద్ధమవుతోందని ఉక్రెయిన్, లేదు.. లేదు.. ఉక్రెయినే తమపై డర్టీ బాంబు దాడికి ఉద్యుక్తరాలవుతోందని రష్యా పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ నవంబర్‌ నెలలో రష్యా పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జైశంకర్‌ పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందులోనూ అణ్వాయుధాల ప్రయోగానికి రెండు దేశాలు సిద్ధమవుతున్నాయనే వార్త అందరినీ బెంబేలెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ నవంబర్‌ 8వ తేదీన రష్యాలో ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమవుతున్నారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధ్రువీకరించింది.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమై.. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.

కాగా మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా అణ్వాయుధాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలు, ఆహార సంక్షోభంపై మరింత నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా డర్టీ బాంబ్‌ అంశం తెరపైకి వచ్చింది. ఈ బాంబు ప్రయోగానికి సన్నద్ధమైందంటూ.. ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇలాంటి కీలక సమయంలో జైశంకర్‌ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఇప్పటికే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ .. రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో ఫోన్‌లో మాట్లాడి శాంతించాలని కోరారు. ఇరు దేశాలూ పరస్పర దాడులకు అణ్వాయుధాలను ఆశ్రయించొద్దని హితవు పలికారు.

రష్యా సైనిక చర్యను ఇప్పటివరకు బహిరంగ వేదికలపై భారత్‌ విమర్శించలేదు. చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని పలుమార్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News