దేవినేని అవినాష్.. కూరలో కరివేపాకేనా?

Update: 2019-11-15 14:30 GMT
తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు దేవినేని అవినాష్. గతంలో తండ్రితో పాటు తెలుగుదేశంలో  చేరారు ఈయన. చేరీచేరగానే ఆ పార్టీలో ఈయనకు తెలుగు యువత అధ్యక్ష పదవి దక్కింది. ఆ పై వెంటనే ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ  నియోజకవర్గం టికెట్ కూడా దక్కింది.

అయితే కొడాలి నాని ముందు  అవినాష్ నిలబడలేకపోయారు. వరసగా నాని మరోసారి  గెలవగా, అవినాష్ భారీగా ఖర్చు పెట్టుకుని ఓడిపోయారని స్థానికులు అంటారు. ఇక తెలుగుదేశం అధికారంలోకి కూడా రాకపోవడంతో.. అవినాష్ అంతిమంగా వైసీపీలోకి చేరారు.

అయితే ఇప్పుడు ఆయనకు గుడివాడలో అయితే ప్రాధాన్యత దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన  మంత్రి కూడా! జగన్ కు సన్నిహితుడుగా కొడాలి నానికి పేరుంది.

ఇలాంటి నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గం విషయంలో అయితే అవినాష్ కూరలో కరివేపాకే అవుతారు. అయితే కృష్ణా జిల్లాలోని మరేదైనా నియోజకవర్గాన్ని ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిటకిటలాడుతూ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు ఉన్నారు. తెలుగుదేశం చేతిలో ఉన్న ఏదైనా నియోజకవర్గం మీద అవినాష్ కాన్సన్ ట్రేట్ చేసుకుంటే కొంతవరకూ ఉపయోగం ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!
Tags:    

Similar News