వైసీపీని పవనే ప్రమోట్ చేస్తున్నారా ?

Update: 2022-09-21 02:30 GMT
ఇపుడిదే అంశం పార్టీ జనాలతో పాటు మామూలు జనాల్లో కూడా చర్చకు దారితీస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు పార్టీ సమావేశం పెట్టినా, ఎక్కడ మీడియాతో మాట్లాడినా ఎక్కువభాగం వైసీపీ గురించే ఉంటోంది.

జగన్మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరుగుతూ, నోటికొచ్చిన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఎంతసేపు జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవటం ఖాయమని ఏమిటేమిటో మాట్లాడుతున్నారు.

రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్ కు ఉందా లేదా అన్నది చెప్పాల్సింది పవన్ కాదు. ఆ విషయాన్ని పవన్ మరచిపోతున్నారు. ప్రజలు ఎవరిని మెచ్చి ఓట్లేస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న చిన్న విషయం కూడా పవన్ కు తెలీదా ? 2019 ఎన్నికల్లో మెజారిటీ జనాలు జగన్ మీద నమ్మకముంచి వైసీపీని 151 సీట్లలో గెలిపించారు. రేపటి ఎన్నికల్లో జగన్ పరిపాలన బాగాలేదని అనుకుంటే ఇదే జనాలు వైసీపీని చిత్తుగా ఓడిస్తారనటంలో సందేహంలేదు.

పవన్ గ్రహించాల్సిందేమంటే రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్ కు ఉందా లేదా అనికాదు తనకుందా లేదా అని. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలు రెండింటిలోను ఎందుకు ఓడిపోయారో ఎప్పుడైనా నిజాయితీగా విశ్లేషించుకున్నారా ?  ముందు తాను గెలవటం, తన పార్టీని గెలిపించుకునే విషయంపై పవన్ దృష్టిపెట్టకుండా 24 గంటలూ వైసీపీ గురించేనా ?

జగన్ కు పవన్ బద్ధ విరోధి అన్న విషయం జనాలందరికీ తెలుసు. ఇంతలా జగన్ను పవన్ వ్యతిరేకిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. మరిక జగన్ గురించి పవన్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది ? తన పార్టీ బలోపేతం గురించి, పార్టీ కార్యక్రమాల గురించి జనాలకు పవన్ వివరిస్తే బాగుంటుంది. అలాకాకుండా ప్రతిరోజు వైసీపీ, జగన్ గురించే మాట్లాడుతుంటే పవనే ప్రమోట్ చేస్తున్నట్లవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News