జ‌గ‌న్ మీద ష‌ర్మిల‌కు అంత కోప‌మా?

Update: 2022-09-24 04:51 GMT
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపైన ఆయ‌న సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల‌కు కోపం ఉందా అంటే అవున‌నే తాజా ప‌రిణామాలు సూచిస్తున్నాయని విశ్లేష‌కులు అంటున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ‌లోని డాక్ట‌ర్ ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాల‌యంగా మారుస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు శాస‌న‌స‌భ‌, శాన‌స‌మండ‌లిలోనూ బిల్లును పెట్టి ఆమోదించుకుంది. ఈ నిర్ణ‌యంపై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, క‌మ్యూనిస్టు పార్టీలు స‌హా వివిధ సంఘాలు నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. ఎన్టీఆర్ పేరునే యూనివ‌ర్సిటీకి ఉంచాల‌ని డిమాండ్ చేశాయి. యూనివ‌ర్సిటీకి పేరు మార్చ‌డాన్ని నిర‌సిస్తూ స్వ‌యంగా వైఎస్ఆర్సీపీలోనే ఉన్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీలాంటి వాళ్లు పేరు మార్చొద్ద‌ని జ‌గ‌న్‌కు విన్న‌వించారు.

ఇదే వ్య‌వ‌హారంపై వైఎస్ ష‌ర్మిల కూడా కొద్ది రోజుల క్రితం స్పందించారు. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ఆమె తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. పేరు మారిస్తే ఆ పేరుకున్న ప‌విత్ర‌త పోతుంద‌న్నారు. ప్ర‌భుత్వం మారిన‌ప్పుడ‌ల్లా పేరు మార్చుకుంటూ వెళ్ల‌డం స‌రికాద‌న్నారు. ఒక పేరు అంటూ పెట్టాక అదే పేరును కొన‌సాగించాల‌న్నారు.

ఇలా పేర్లు మారిస్తే అప్ప‌టివ‌ర‌కు ఆ సంస్థ‌కున్న ప‌విత్ర‌త పోతుంద‌న్నారు. అంతేకాకుండా అన‌వ‌స‌ర‌మైన అయోమ‌యాన్ని సృష్టించిన‌ట్టు అవుతుంద‌న్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే ఎవ‌రు ఏది రిఫ‌ర్ చేస్తున్న‌ది కూడా అర్థం కాద‌ని ష‌ర్మిల అన్నారు. ఉన్న పేరునే కొన‌సాగిస్తే ఆ పేరును త‌ర‌త‌రాలు గౌర‌వించిన‌ట్టు అవుతుంద‌ని చెప్పారు.

ఇప్పుడు మ‌రోమారు కూడా ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే ఉన్న పేరును తొల‌గిస్తే ఆ మ‌నిషిని అవ‌మానించిన‌ట్టే. ఆయ‌న‌ను ఆరాధించే కోట్లాది మంది మ‌నుషుల‌ను కూడా అవ‌మానించిన‌ట్టేన‌ని అన్నారు. రేపు ఇంకో ప్ర‌భుత్వం వ‌చ్చి వైఎస్సార్ పేరును తొల‌గించి పాత పేరునే కొన‌సాగిస్తే అప్పుడు ఆయ‌న‌ను అవ‌మానించిన‌ట్టు అవుతుంద‌న్నారు. ఎన్టీఆర్ ఖ్యాతిని వైఎస్సార్‌కు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. వైఎస్సార్‌కున్న పేరుప్ర‌ఖ్యాతులు ఈ ప్ర‌పంచంలోనే ఎవ‌రికీ లేవ‌ని ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాగా ష‌ర్మిల ఇటీవ‌లి, తాజా వ్యాఖ్య‌ల‌పై విశ్లేష‌కుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని నేరుగా తీవ్రంగా ఆమె త‌ప్పుబ‌ట్టారు. వైఎస్ జ‌గ‌న్‌పై త‌న‌కున్న కోపాన్ని ఆమె ఇలా చూపార‌ని అంటున్నారు. వాస్త‌వానికి 2019 ఎన్నికల‌కు కొద్ది కాలం ముందు.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని నిల‌బెట్ట‌డానికి ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల సుదీర్ఘ పాద‌యాత్ర చేశారు. నేను మీ రాజ‌న్న కూతురిని.. మీ జ‌గ‌న‌న్న చెల్లెల్ని.. నేను జ‌గ‌న‌న్న వ‌దిలిన‌ బాణాన్ని అంటూ ష‌ర్మిల ప్ర‌సంగాల‌కు మంచి ప్ర‌శంస‌లే ద‌క్కాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ ష‌ర్మిల ప్ర‌చారం చేశారు.

ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. క‌డ‌ప ఎంపీగా ష‌ర్మిల పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆమె కూడా ఆస‌క్తి చూపారు. అయితే జ‌గ‌న్.. ష‌ర్మిల‌కు సీటు నిరాక‌రించి అవినాష్‌రెడ్డికి ఇవ్వ‌డంతో ష‌ర్మిల బాధ‌ప‌డ్డార‌ని అంటారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు అయినా పంపుతార‌ని ఆశించారు. వైఎస్ జ‌గ‌న్ ఇందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు.

అంతేకాకుండా త‌న‌కు రావాల్సిన ఆస్తుల‌ను కూడా జగ‌న్ పంప‌కాలు చేయ‌క‌పోవ‌డంపై ష‌ర్మిల కోపంగా ఉన్నార‌ని చెబుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌కే ఆమె తెలంగాణ‌కు వెళ్లిపోయి త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ఉంటూ పార్టీ పెట్టుకున్నార‌ని గుర్తు చేస్తున్నారు. అక్క‌డ పార్టీ పెట్ట‌డం కూడా జ‌గ‌న్‌కు ఇష్టం లేద‌ని.. ఎలాంటి ఆశీస్సులు ఆమెకు ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. చివ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ కు కుడి భుజంగా చెప్ప‌బ‌డుతున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వాళ్లు అయితే ష‌ర్మిల పార్టీతో త‌మ‌కు సంబంధం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీనిపైన ఒక ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు కూడా.

త‌న అన్న జ‌గ‌న్‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆయ‌న‌కు అవ‌స‌ర‌మున్న ప్ర‌తిసారీ ఆయ‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అమ్మ‌, నేను ఎన్నో చేశామ‌ని ష‌ర్మిల ఆ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేశారు. అయితే త‌న పార్టీతో వారికి సంబంధం లేద‌ని సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో చెప్పించ‌డం బాధ క‌లిగించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ష‌ర్మిల.. విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ ఏర్పాటును మార్చడాన్ని తీవ్రంగా ఖండించార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News