చంద్ర‌బాబు కొత్త వ్యూహం ఇదేనా?

Update: 2022-09-13 08:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం టీడీపీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపొంద‌కపోతే టీడీపీ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మ‌య్యే ప‌రిస్థితులు తలెత్తినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే టీడీపీని, ఆ పార్టీ నేత‌ల‌ను వైఎస్సార్సీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్ని విధాలా అష్ట‌దిగ్బంధ‌నం చేస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వీటికి విరుగుడు వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు.

ఇందులో భాగంగా చంద్ర‌బాబు ఒక కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్న క్యాంటీన్ల‌కు మంచి పేరొచ్చింది. రూ.10 కూడా పెట్టాల్సిన అవ‌సరం లేకుండా అన్న క్యాంటీన్ల ద్వారా ప‌ట్టెడ‌న్నం పెడుతున్నార‌ని ప్ర‌జ‌లు ప్ర‌శంసించారు. ఇక టిఫిన్లు అయితే ఇంకా త‌క్కువ రేటుకే అందించారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్న క్యాంటీన్ల‌ను మూసివేయించింది. కొన్ని చోట్ల కూల్చి వేయించింది.

అయితే కొన్నిచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన‌చోట అన్న క్యాంటీన్ల‌ను ఆ పార్టీ నేత‌లు సొంత ఖ‌ర్చుల‌తో నిర్వ‌హిస్తున్నారు. నారా లోకేష్ పోటీ చేసిన మంగ‌ళ‌గిరిలో, చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో, బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం, త‌దిత‌ర చోట్ల టీడీపీ నేత‌లు అన్న క్యాంటీన్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. దీంతో టీడీపీకి మంచి పేరొస్తుంద‌ని భావిస్తున్న వైఎస్సార్సీపీ నేత‌లు వీటిని ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటున్నారు. స్వ‌యంగా చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో అన్న క్యాంటీన్ ను విధ్వంసం చేశారు. ఇది చంద్ర‌బాబు అక్క‌డే ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడే జ‌రిగింది. ఇక గుంటూరు జిల్లా తెనాలి, మ‌రికొన్ని చోట్ల కూడా అన్న క్యాంటీన్లు రోడ్డుగా అడ్డంగా ఉన్నాయ‌ని చెబుతూ వాటిని వైఎస్సార్సీపీ నేత‌లు కూల్చివేయిస్తున్నారు.

అధికార పార్టీ నేత‌ల‌పై ప్ర‌జ‌ల్లో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పేద‌లు, కూలీలు, చిరుద్యోగులు, నిరుద్యోగులు ఇలా ఎంతోమందికి అతి త‌క్కువ ఖ‌ర్చుకే ప‌ట్టెడ‌న్నం పెడుతున్న అన్న క్యాంటీన్ల‌ను మ‌రిన్నిచోట్ల నెల‌కొల్పాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ప్ర‌జ‌ల్లో అన్న క్యాంటీన్ల‌పై ఉన్న ఆద‌ర‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓట్లు కురిపిస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రమంత‌టా అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు నాయుడు టీడీపీ నేత‌ల‌కు ఆదేశాలు ఇచ్చారు. వీటిని సొంత ఖ‌ర్చులు నిర్వ‌హించాల‌ని, లేదా ఎవ‌రైనా స్వ‌చ్చంధ సంఘాలు క‌లిస్తే వారితోనూ అన్న క్యాంటీన్లు నిర్వ‌హించాల‌ని సూచించారు. అలాగే పార్టీ త‌ర‌ఫున కూడా అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌కు కొంత నిధిని ఇస్తామ‌ని ఆయ‌న చెప్పారంటున్నారు. అలాగే టీడీపీ నేత‌ల ఇళ్ల‌లో జ‌రిగే శుభ కార్యాల‌ను అన్న క్యాంటీన్ల‌లో నిర్వ‌హించి.. భోజ‌నాలు అక్కడే పెట్టుకోవాల‌ని.. కొంత విరాళం అన్న క్యాంటీన్ల‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు సూచించార‌ట‌.

దీనివ‌ల్ల రెండు ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఎక్క‌డిక‌క్క‌డ ఈ అన్న క్యాంటీన్ల‌ను వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం, ఆ పార్టీ నేత‌లు అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసుల‌తో లాఠీచార్జి చేయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌పైకి దాడికి దిగి వారిని పోలీసుల‌తో అరెస్టు చేయిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో త‌మ‌పై సానుభూతి వ‌స్తుంద‌ని, అలాగే త‌క్కువ ఖ‌ర్చుకే పేద‌ల‌కు అన్నం పెడుతుంటే వైఎస్సార్సీపీ అడ్డుకుంటోంద‌నే ఆగ్ర‌హం కూడా ప్ర‌జ‌ల్లో వ‌స్తుంద‌ని టీడీపీ భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల‌ను నిర్వ‌హించాల‌ని టీడీపీ పిలుపునిచ్చింద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News