కాపుల్లో ఐక్యత సాధ్యమేనా ?

Update: 2022-02-28 04:29 GMT
దశాబ్దాలుగా కాపు సామాజికవర్గాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్యిదే. ఉండటానికి రాష్ట్రజనాభాలో కాపులు సుమారు 20 శాతం ఉన్నారు. అయితే రాజకీయాధికారం మాత్రం సాధ్యం కావటంలేదు. అప్పుడొకరు ఇప్పుడొకరు కాపులకు రాజకీయాధికారం కావాలని, రిజర్వేషన్ కావాలని కాస్త హడావుడి చేసి మళ్ళీ చప్పబడిపోతున్నారు. కాపులకు రాజకీయాధికారం అనేది కేవలం నినాదంగా మాత్రమే మారిపోయింది.

 కాపులకు రాజ్యాధికారం రావాలంటే ఏమి చేయాలి ? ఏమిచేయాలంటే ముందు కాపుల్లోని అనేక సంఘాలు ఏకమవ్వాలి. కాపునాడు, కాపు సంక్షేమ సంఘం లాంటి అనేక పేర్లతో చాలా సంఘాలున్నాయి. ముందు ఇవన్నీ ఏకమైతే తర్వాత రాజకీయాధికారం గురించి ఆలోచించవచ్చు. అలాగే వివిధ పార్టీల్లోని కాపునేతలంతా ముందు ఏకం కావాలి. అంటే తమ పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసి కాపుల కోసమే పెట్టే పార్టీలో చేరాలి. అది సాధ్యమయ్యేదేనా ?

 పదవుల్లో ఉన్న కాపునేతల్లో తమ పదవుకు రాజీనామాలు చేయటానికి  రెడీ అయ్యేదెంతమంది ? అలాగే అధికారపార్టీలోని కాపునేతలు బయటకు వచ్చి చేసేదేముంది అని ఆలోచిస్తారు ? అంటే కాపు నేతల్లోని అనైక్యతే కాపులను రాజకీయాధికారానికి దూరం చేస్తోంది. ఇదే సమయంలో కాపులనందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేంత స్ధాయున్న  నేత కూడా లేరు.  నిజంగానే అంతటి స్ధాయున్న నేతే ఉండుంటే కాపుల్లోనే ఇన్ని సంఘాలు ఏర్పడేవి కావు.

 ఇపుడు కాపుల పేరుతో  సమావేశాలు పెట్టి హడావుడి చేస్తున్న నేతల్లో కూడా పెద్ద స్టేచర్ ఉన్న నేతలులేరు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజకీయాధికారంపైన చర్చ జరిగింది. అలాగే ఫోరం ఫర్ బెటర్ ఏపి అనే వేదికను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు.

సమావేశానికి హాజరైన వారిలో ఎంతమందికి జనామోదం ఉందో ఎవరికి వాళ్లుగానే విశ్లేషించుకోవాలి. రాజకీయనేతల్లో చాలామంది మీద అవినీతి ఆరోపణలున్నాయి. ఇక ఉన్నతాధికారులుగా పనిచేసిన వారిలో చాలామందికి జనాలతో సంబంధాలే లేవు. మరిలాంటి వారంతా ఎన్నిసార్లు సమావేశాలు పెట్టుకుంటే ఏమిటి ఉపయోగం ?

Tags:    

Similar News