ప‌చ్చ‌బొట్టు జ‌గ‌న్ అభిమాని టీడీపీలో చేరిన వేళ‌!

Update: 2022-07-11 12:30 GMT
ప‌చ్చ‌బొట్టు జ‌గ‌న్ అభిమాని టీడీపీలో చేరిన వేళ‌!
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వీరాభిమానులున్నారు. ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే కాకుండా ఆయ‌న‌ను వ్య‌క్తిగ‌తంగా అభిమానించేవారు కోకొల్ల‌లు. అయితే త‌న చేతిపై ఆయ‌న పేరును ఎంతో అభిమానంగా ప‌చ్చ బొట్టు పొడిపించుకున్న వీరాభిమాని జ‌గ‌న్ ను వ‌దిలిపెట్టి వేరే పార్టీలో చేరారంటే న‌మ్మ‌డం క‌ష్టం. కానీ ఇదే జ‌రిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా వలేటివారిపాలెం మండలంలోని చుండికి చెందిన ముతకని రమేశ్ ‌కు జగన్‌ అంటే చెప్పలేనంత అభిమానం. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ పేరును త‌న కుడి చేయి మ‌ణిక‌ట్టుపై నుంచి మోచేయి వ‌ర‌కు ప‌చ్చ బొట్టు పొడిపించుకున్నాడు. వైఎస్ అనే అక్ష‌రాల‌ను ఇంగ్లిషులో, జ‌గ‌న్ అనే అక్ష‌రాల‌ను తెలుగులో చాలా పెద్ద‌గా, పొడ‌వుగా ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాడు. అంతేకాకుండా హృద‌యాకారంతో ల‌వ్ సింబ‌ల్ ను కూడా వైఎస్ జ‌గ‌న్ పేరు ప‌క్క‌నే వేయించుకున్నాడు.

అలాంటి జ‌గ‌న్ వీరాభిమాని అయిన ముత‌కాని ర‌మేష్ తెలుగుదేశం పార్టీలో చేర‌డం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు ఇది సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ గా మారింది. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అత‌డి ఫొటోను సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ ను, వైఎస్సార్సీపీ నేత‌ల‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ ప్లీన‌రీ జూలై 9న ముగిశాక ముత‌కాని ర‌మేష్ కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తన బంధువులు, స్నేహితులతో కలిసి టీడీపీలో చేరాడు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ర‌మేష్ వైఎస్సార్సీపీలోనే కొన‌సాగ‌డం విశేషం. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు, జగన్ సాహసానికి రమేష్ చాలా ముగ్ధుడయ్యాడు. జ‌గ‌న్ వైఎస్సార్సీపీని ప్రారంభించిన‌ప్పుడు రమేష్ తన కుడిచేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.
Tags:    

Similar News