ఎవడో ఆర్డర్ ఇస్తాడు..ఎన్నికల కమిషనర్ చదువుతున్నాడు

Update: 2020-03-15 10:15 GMT
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంపై సీఎం జగన్ నిప్పులు  చెరిగారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనరేట్ లో ఉన్న సెక్రెటరీకి ఇలాంటి ఆర్డర్ ఒకటి తయారవుతున్నట్లు తెలియదని.. ఎవడో రాస్తున్నారని.. ఎవరో ఆదేశాలు ఇస్తున్నారని.. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ చదువుతున్నారని సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని జగన్ అన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారని.. తమ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ ను నియమించలేదని.. ఈయన చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నాడని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రమేష్ విచక్షణ కోల్పోయారని.. నిష్ఫాక్షత లేకుండా విధులు నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు గౌరవం ఉండదన్నారు.

కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నానని చెప్పిన రమేష్ కుమార్ ఎందుకు గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు మరికొంత మందిని బదిలీ చేస్తూ ప్రకటన చేశారని సీఎం ధ్వజమెత్తారు.

151మంది ఎమ్మెల్యేలతో ప్రజా బలంతో గెలిచి అధికారంలోకి వచ్చిన తమకు పవర్ ఉంటుందా? ఎన్నికల కోడ్ ఉందని రమేష్ కుమార్ కు అధికారం ఉంటుందా అని సీఎం జగన్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వొద్దంటున్నారని.. తనకు ఆశ్చర్యంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు? సీఎంలు - ఎమ్మెల్యేలు ఎందుకని.. ఎన్నికల కమిషనర్లనే ముఖ్యమంత్రిగా చేసేవచ్చు కదా అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. అధికారులను బదిలీ చేసే హక్కు ఈసీకి ఎక్కడుందని నిలదీశారు.


Tags:    

Similar News